ArticlesNews

అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌకా విహారం.. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు అవకాశం!

304views

దేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడానికి రూపొందించిన ‘ఎంవీ గంగా విలాస్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నదీ యానం చేసే విలాసవంతమైన నౌకగా ఇది చరిత్ర సృష్టించనుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ల పరిధిలోని అయిదు రాష్ట్రాల ద్వారా 27 నదీ మార్గాల్లో 3,200 కి.మీ.దూరం ఈ నౌక ప్రయాణిస్తుంది. 51 రోజులపాటు కొనసాగే ప్రయాణంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ రేవులతో పాటు పాట్నా, సాహిబ్‌గంజ్‌, కోల్‌కతా, గువాహటి, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా వంటి నగరాల్లో ఈ నౌక మజిలీ చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

తొలి విడతలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది విదేశీ పర్యాటకులు ప్రయాణించనున్నారు. ఈ నెల 13న వారణాసి నుంచి బయలుదేరే ఎంవీ గంగా విలాస్‌ మార్చి మొదటి వారంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న దిబ్రూగడ్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. నౌకలో అంతర్జాతీయ స్థాయిలో విలాసవంతమైన సదుపాయాలను సమకూర్చారు. నదీ పర్యాటకానికి ఉన్న భారీ అవకాశాలను వెలికి తీసే లక్ష్యంతో ఎంవీ గంగా విలాస్‌ కీలకమైన ఓ ముందడుగుగా కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ అభివర్ణించారు. నదుల్లో నౌకా విహారం జరిగే దేశాల జాబితాలో భారత్‌కు చోటు లభిస్తుందన్నారు.