
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గుమ్మిలేరు గ్రామానికి చెందిన మహిళలు అత్యంత పొడవైన భోగి పిడకల దండను తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పశుపోషణకు ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఏటా ఈ భోగి దండను తయారు చేస్తుంటారు. గతంలో వీరు తయారు చేసిన పిడకల దండలకు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్సులో కూడా నమోదు చేశారు. ఈక్రమంలో ఈ ఏడాది కూడా కిలోమీటరు పోడవైన భోగి దండను తయారు చేసి తమ భక్తిని చాటుకున్నారు.
ఆరు టన్నుల ఆవు పేడ సేకరించిన మహిళలు..
ఈ దండను తయారు చేయడానికి వారు.. చింతలూరులో ఉన్న గోశాల, గ్రామంలోని పాడి రైతుల నుంచి ఆరు టన్నుల వరకు, ఆవు పేడను సేకరించి వినియోగించారు. గ్రామంలోని ప్రతి ఇంట్లోని మహిళ భోగి దండ తయారీలో భాగమయ్యారు. ఈ భోగి దండను తయారు చేయడానికి గ్రామంలోని మహిళలు ముందుగా ఆవు పేడ సేకరించుకున్న తర్వాత.. పిడకలను తయారు చేస్తామని తెలిపారు. పిడకలు ఆరిన తర్వాత దారం సాయంతో ఒక దండలాగా తయారు చేస్తామన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఈ భోగి పిడకల దండ తయారీలో నిమగ్నమైనట్లు వారు పేర్కోన్నారు. పురాతన కాలం నుంచి వస్తున్న సంస్కృతీ, సంప్రదాయలను మరిచిపోకుండా ఉండేందుకే ఇలా తయారు చేశామని గుమ్మిలేరు మహిళలు అంటున్నారు.





