News

సంఘ్ బీజేపీకి మాత్రమే సంఘటనా కార్యదర్శిని ఇస్తుందా? అందరికీ ఇస్తుందా?

4views
సంఘ్ కి రాజకీయాలతో సంబంధం లేకపోతే, బీజేపీకి సంఘటనా కార్యదర్శిని సంఘమే ఎందుకు పంపిస్తుంది? మిగతా పార్టీలకి ఎందుకు పంపదు? అలాగే సంఘ్ ఇతర పార్టీలకు లేదా సంస్థలకు ఇప్పటి వరకూ ఎప్పుడైనా తన సమర్థనను అందించిందా? అన్న ప్రశ్నని కొందరు అడుగుతుంటారు. అయితే.. దీనికి సమాధానాన్ని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ 2018 న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ‘‘భవిష్య భారతం’’ అన్న పేరుతో ఏర్పాటు చేసిన వ్యాఖ్యాన మాల సంకలనంలో జవాబిచ్చారు.
సంఘటనా కార్యదర్శి కావాలని ఎవరడుగుతారో, వారికే సంఘ్ ఇస్తుంది. ఇప్పటి వరకూ మిగతావారెవ్వరూ అడగలేదు. అడిగితే అప్పుడు ఆలోచిస్తాం. వారి పనితీరు బాగుంటే కచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే 93 సంవత్సరాలుగా మేము ఏ రాజకీయ పార్టీని సమర్థించలేదు. కానీ మేము ఓ విధానాన్ని సమర్థించడం మాత్రం కచ్చితంగా చేశాం, ఆ విధానం మా శక్తిని పెంపొందింజేసేదైతే అలాంటి దాన్ని తప్పనిసరిగా సమర్థించాం. అలాగే అది ఆ రాజకీయ పార్టీలకూ లాభిస్తుంది. అలాంటి లాభాన్ని పొందాలనుకున్న వారు తీసుకుంటారు. ఇష్టం లేనివారు అలాగే మౌనంగా వుండిపోతారు.
అత్యవసర పరిస్థితి సమయంలో మనం దాన్ని వ్యతిరేకించాం, అంటే అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించే విధానాన్ని ఎంచుకున్నాం. అనేక మంది అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడారు. అయితే ఆ పోరాటం ద్వారా జనసంఘ్ లాభపడుతుందని మేము ఆలోచించలేదు. ఆ పోరాటంలో బాబూ జగ్జీవన్ రాం కూడా వున్నారు. అందులోనే ఎస్.ఎం. జోషి, గోరె కూడా వుండేవారు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఏ.కె. గోపాలన్ జీ కూడా వున్నారు. వీరందరికీ కూడా లాభమే కలిగింది.
స్వయంసేవకులు అందరి కొరకు పనిచేశారు. రామ మందిర నిర్మాణం అనే అంశం ఆధారంగా జరిగిన ఒకే ఒక ఎన్నికల్లో మేము తీసుకున్న విధానాన్ని కేవలం బీజేపీ మాత్రమే సమర్థించింది. అప్పుడు కేవలం బీజేపీ కి మాత్రమే లాభం కలిగింది. ఎప్పుడైతే అది ఓ కూటమిగా ఇతర పార్టీలతో కలిసిందో, అప్పుడా కూటమిలోని వారందరికీ లాభం జరిగింది. ఆ విధంగా మేము విధానాన్ని గౌరవిస్తాం, అంతేకానీ పార్టీలను ఎప్పుడూ సమర్థించలేదు, సమర్థించం కూడా. మా సమర్థన కారణంగా లాభం కలిగితే, దాన్ని ఎలా అందుకోవాలి అనే ఆలోచన చేయాల్సింది వారి పనే. రాజకీయాలు వాళ్లు చేస్తారు. మేం కాదు.
సంఘాన్ని ఉపయోగించుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఇది జరిగే పనే కాదు. సంఘం ద్వారా ఎప్పుడూ అలా జరగలేదు. నేడు చాలా మంది వస్తుంటారు. ఫోటోలు తీసుకుంటుంటారు. అప్పుడప్పుడు తమ దరఖాస్తుతో పాటు వాటిని జోడిస్తుంటారు. మీరు చెప్పినట్లుగా ఈ దరఖాస్తు ఎక్కడికి చేరుతుందో, అక్కడ కూర్చొన్న సంఘటనా కార్యదర్శి స్వయంసేవక్ అయి వుంటారు. వారికి తెలుసు ఈ ఫోటో అర్థం ఏమిటన్నది? లాభం కలుగదు సరికదా, నష్టమే జరుగుతుంది.
సంఘ్ కి ఓ కార్య పద్ధతి వుంది. అందులోకి ఎవరు వచ్చినా, వారు అప్పటి వరకూ ఎలా వున్నా, మాకు ఎలా కావాలో అలా తయారై బయటికి వెళ్తారు. ఒకవేళ మనస్సులో స్వార్థం లాంటివి వున్నా, గట్టు తెగిపోతాయి. అంతేకానీ సంఘ కార్యంలో జీవితాంతం వుండిన తర్వాత కూడా, ఒక్కసారి అయినా ధన్యవాదాలు కూడా ఎవ్వరూ చెప్పరు. పొందడం మాట అలా వుంచి, అంతా ఇవ్వడమే ఇవ్వడం.
మహారాష్ట్ర ప్రాంత సంఘచాలక్ గా బాబారావ్ భిడేజీ వుండేవారు. ఆయన స్వయంసేవకులతో, సంఘంలో ‘‘యాద్యా’’ తయారు చేస్తారు అంటుండేవారు. మరాఠీలో ‘‘యాది’’ అంటే సూచీ (జాబితా) అని అర్థం. కానీ ఆ అక్షరాలను విడివిడిగా గ్రహిస్తే ‘‘యా (రావాలి) మరియు ‘‘ద్యా’’ (ఇవ్వాలి) అని అర్థం. సంఘంలో యాద్యా పని జరుగుతుంది. వచ్చి ఇచ్చేవారు వుంటారు. ఇచ్చి పుచ్చుకోవడమేమీ వుండదు. అదీ సంఘమంటే. అయినా కూడా ఒకరిద్దరు తెలివి మీరిన వారు వుండొచ్చు. మేమేం చేయగలం? సంఘానికి మీరు వచ్చి, ఎక్కువ సమయం సంఘంతో వుంటే, మీరు కూడా సంఘంవారే అయిపోయే ప్రమాదముందని మాత్రం నేను చెప్పగలను.
రాజకీయాలనేవి లోక కల్యాణం కోసనం నవాలి. లోక కల్యాణానికి మాధ్యమం రాజకీయ అధికారం అవుతుంది. అంత వరకే అధికారం కలిగిన రాజకీయాలు నడవాలి. అంతకంటే ఎక్కువ నడవలొద్దు. రాజకీయాల్లో వున్న వారు దాని గురించి ఆలోచించాలి.