
తమిళనాడులోని మదురై ప్రసిద్ధ మీనాక్షి అమ్మన్ ఆలయానికి అనుబంధంగా ఉన్న ధార్మిక ట్రస్ట్‌కు చెందిన సుమారు రూ.60 కోట్ల విలువైన 1.79 ఎకరాల భూమి అక్రమ ఆక్రమణకు గురైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు 19 మందిపై కేసు నమోదు చేశారు. మోసపూరిత భూ బదిలీలు, రిజిస్ట్రేషన్లు, తాకట్టు లావాదేవీల ద్వారా ఆలయ భూమిని కాజేసేందుకు కుట్ర జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆలయ జాయింట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెల్లదురైతో పాటు అవినీతి వ్యతిరేక సంస్థ ‘అరప్పోర్ ఇయక్కం’ ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా, 2016 జూన్ 24న అప్పటి మదురై ఉత్తర తహసీల్దార్ అన్బళగన్ ప్రభుత్వ రికార్డుల నుంచి ఆలయ యాజమాన్య వివరాలను తొలగించి, భూమి లీజును చట్టవిరుద్ధంగా తొమ్మిది మంది పేర్లకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. అనంతరం రెవెన్యూ శాఖ అధికారులు ఆ ఉత్తర్వులను రద్దు చేసి, లీజును తిరిగి ఆలయం పేరుతో పునరుద్ధరించారు. ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో కేసు పెండింగ్‌లో ఉండగా, మధ్యంతర స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి.
అయినప్పటికీ, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ 2020 ఏప్రిల్ 16న తూత్తుకుడి జిల్లా మురప్పనాడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టర్ చేసినట్లు, అనంతరం 2021 జూలై 19న దిండిగల్ జిల్లా వడమదురై సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తాకట్టు పత్రాన్ని కూడా నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ కౌలు బదిలీ, తాకట్టు పత్రాల ఆధారంగా ఆలయ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు.





