ArticlesNews

సేంద్రీయ వ్యవసాయంలో సైంటిస్ట్​ అద్భుతాలు

4views

విదేశాల్లో మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, సౌకర్యవంతమైన జీవితం- చాలా మంది కలలు కనే జీవితాన్ని వదిలేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఓ శాస్త్రవేత్త. వ్యవసాయం లాభదాయకం కాదనే భావనను చెరిపేస్తూ, ప్రకృతికి మేలు చేసే సేంద్రీయ వ్యవసాయంతో రైతు కూడా ఆర్థికంగా ఎదగొచ్చని చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త శితికాంత్ బెహెరా రూపొందించిన సమగ్ర సేంద్రీయ వ్యవసాయ నమూనా ఇప్పుడు రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

సంబల్‌పుర్ నగరానికి చెందిన శితికాంత్ బెహెరా 1999 నుంచి 2008 వరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణ శాస్త్రవేత్తగా పనిచేశారు. అనంతరం సింగపూర్, నైజీరియా వంటి దేశాల్లో పర్యావరణ శాస్త్రవేత్తగా ఉద్యోగం చేసి మంచి స్థాయికి చేరుకున్నారు. అయినప్పటికీ తన స్వగ్రామం కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన ఆయనను ఎప్పుడూ వెంటాడేది. చివరకు 2018లో విదేశీ ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు తిరిగి వచ్చారు. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరగడం, రైతులు వాటిపైనే అతిగా ఆధారపడటం చూసిన ఆయన, ప్రకృతిని కాపాడుతూ కూడా మంచి ఆదాయం పొందే వ్యవసాయ నమూనాను (ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మోడల్) రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనతోనే 2021లో సంబల్‌పూర్ జిల్లా జుజుమురా బ్లాక్‌లో గోవర్ధన్- బడ్మాల్ గ్రామంలో 13 ఎకరాల భూమిలో సమగ్ర సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించారు.

పశుపోషణ నుంచి చేపల పెంపకం వరకు అంతా ఒకే చోట!
ఈ వ్యవసాయ క్షేత్రంలో పశుపోషణ, మేకల పెంపకం, చేపల పెంపకం, మామిడి తోటలు, కూరగాయలు సహా వివిధ పంటల సాగు అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఇక్కడ ఒక విభాగంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలు మరో విభాగానికి ఉపయోగపడేలా మొత్తం వ్యవస్థను రూపొందించారు. దీంతో ఏ వనరును కూడా వృథా చేయకుండా స్వయం సమృద్ధి సాధించారు. ఇదే సమగ్ర సేంద్రీయ వ్యవసాయం ప్రత్యేకత.

50 ఆవులు, 3 బయోగ్యాస్ ప్లాంట్లు- LPG అవసరమే లేదు
తన వ్యవసాయ క్షేత్రానికి ప్రధాన బలం పశుపోషణ. అవును ఇక్కడ సుమారు 50 ఆవుల్ని పెంచుతున్నారు బెహెరా. వాటి పేడతో 3 బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వంటతో పాటు రోజువారీ అవసరాలన్నీ బయోగ్యాస్ ద్వారానే తీర్చుకుంటున్నారు. దీంతో ఎల్పీజీ గ్యాస్ కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. బయోగ్యాస్ ప్లాంట్స్ నుంచి వచ్చే పేడను 27 వర్మీ కంపోస్ట్ ట్యాంకుల్లో నిల్వ చేసి సేంద్రీయ ఎరువుగా తయారు చేస్తున్నారు. ఈ ఎరువును తమ పొలాల్లో వినియోగించడంతో పాటు కొంత భాగాన్ని విక్రయిస్తున్నారు శితికాంత్. ఆవు మూత్రాన్ని సహజసిద్ధమైన పురుగుమందుగా ఉపయోగిస్తున్నారు. ఫారంలో తయారయ్యే బయో అమృతాన్ని చేపల పెంపకంలో ఆహారంగా వినియోగిస్తున్నారు. దీంతో పశుపోషణ, చేపల పెంపకం, ఉద్యానవనం, వ్యవసాయం ఇలా అన్నీ ఒకదానికొకటి సహకరించే విధంగా సాగుతున్నాయి.

కెమికల్స్ వాడకుండా అద్భుతాలు
కూరగాయల సాగులో కూడా బెహెరా వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. టమాటా, వంకాయ మొక్కల మధ్య బంతి, మెంతి పూలు వంటి మొక్కల్ని పెంచుతున్నారు. ఇవి సహజంగానే పురుగుల్ని దూరం చేస్తాయి. దీంతో రసాయన పురుగు మందుల అవసరం లేకుండానే పంటల్ని రక్షిస్తున్నారు. ఈ విధానం రైతుల ఖర్చును తగ్గిస్తూ ఆరోగ్యకరమైన పంటల్ని అందిస్తోంది. వ్యవసాయాన్ని కేవలం పంటలకే పరిమితం చేయకుండా మరో అడుగు ముందుకేశారు. తన ఫారంలో అగ్రో ఎకో టూరిజం ప్రారంభించి పర్యటకుల కోసం ప్రత్యేక కాటేజీలు కూడా నిర్మించారు శితికాంత్ బెహెరా. ఇక్కడి వచ్చే వారు సేంద్రీయ వ్యవసాయం ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా చూస్తున్నారు.

బెహెరా రూపొందించిన సమగ్ర సేంద్రీయ వ్యవసాయ మోడల్‌కు ప్రభుత్వ స్థాయిలో కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. జిల్లా వ్యవసాయ శాఖ ఇక్కడే రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాన్ సోరెన్ మాట్లాడుతూ- వ్యవసాయ శాఖ నుంచి పలు పథకాల ద్వారా సహాయం అందించామని, ప్రస్తుతం ఈ ఫారం రైతులకు శిక్షణా కేంద్రంగా మారిందని తెలిపారు.

శితికాంత్ బెహెరా రూపొందించిన ఫార్మింగ్ మోడల్ నిజమైన సర్క్యులర్ ఎకానమీకి ఉదాహరణ అని సంబల్‌పుర్‌కు చెందిన విద్యావేత్త, ఆర్థిక వేత్త డాక్టర్ ఉమాచరణ్ పతి ప్రశంసించారు. ఈ ఫారంలో రసాయన ఎరువులు, పురుగు మందులకు చోటులేదని, ప్రతి వనరును మళ్లీ వినియోగించే విధంగా వ్యవస్థను రూపొందించడం నిజంగా గొప్ప విషయమన్నారు. రాబోయే రోజుల్లో వేలాది మంది రైతులకు ఈ మోడల్ స్ఫూర్తిని ఇస్తుందని అభిప్రాయపడ్డారు.

‘మంచి ఆహారం తినండి. మంచి పోషకాలు పొందండి. నేలలో విషం కలపొద్దు. నోట్లోకి విషం తీసుకోవద్దు.’ అనేదే బెహెరా సందేశం. సేంద్రీయ వ్యవసాయం వల్ల పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా రైతు ఆర్థికంగా కూడా బలపడతాడని ఆయన నమ్ముతున్నారు. అందుకే ముందుగా తానే విజయం సాధించి, ఇప్పుడు ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.