News

ముంబైలో బంగ్లాదేశీ చొరబాటుదారులు కోసం నకిలీ రేషన్ కార్డులు

5views

 

ముంబైలో నిర్వహించిన తనిఖీల్లో 20 నకిలీ రేషన్ కార్డులు గుర్తించినట్లు మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఈ కార్డులు బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ వలసదారులతో సంబంధం ఉన్నవిగా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల గుర్తింపు కార్డు, ఆధార్ వంటి ఇతర పత్రాలతో పాటు భారత పౌరసత్వానికి సంబంధించిన గుర్తింపు పత్రాలుగా వీటిని ఉపయోగించే ఉద్దేశంతో నకిలీ రేషన్ కార్డులు రూపొందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.

అధికారుల వివరాల ప్రకారం, గుర్తించిన ఈ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ రేషన్‌ను ఎలాంటి సందర్భంలోనూ తీసుకోలేదని వెల్లడైంది. దీంతో, వాటిని కేవలం గుర్తింపు పత్రాలుగా వినియోగించేందుకు సృష్టించి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

గత నెలలో ఛత్రపతి సంభాజీనగర్‌లో ఒక నకిలీ రేషన్ కార్డుకు సంబంధించిన ఫిర్యాదు అందినప్పటికీ, ముంబై మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ఇలాంటి కేసులపై ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు రాలేదని అధికారులు తెలిపారు. అయితే, ఇతర జిల్లాల్లో కూడా ఇటువంటి నకిలీ రేషన్ కార్డులు ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పేర్కొన్నారు.

2025లో ఉగ్రవాద నిరోధక దళం (ATS) అందించిన అనుమానితుల జాబితాను అన్ని జిల్లా సరఫరా అధికారులకు పంపినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఈ అంశంపై ఇప్పటికే మూడు సార్లు రిమైండర్లు జారీ చేసినట్లు తెలిపింది. త్వరలో అన్ని జిల్లా సరఫరా అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర నివేదిక కోరనున్నట్లు అధికారులు వెల్లడించారు.