News

రానున్న ఎన్నికల్లో తెలంగాణ, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ జెండా ఎగురవేస్తాం – కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధీమా

311views

రానున్న ఎన్నికల్లో(2023) తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో- ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలంటే- 2023లో జరిగే అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతానై ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఛత్తీస్ గఢ్ లో పర్యటించిన అమిత్‌షా కోర్బాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది చివరిలో రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులే తమను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టామని, ఫలితంగా అశాంతియుత వాతావరణాన్ని తొలగిపోయిందని అమిత్ షా పేర్కొన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోపు మావోయిస్టు రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై ప్రధానం దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. సామాన్య, అమాయక ప్రజలు తీవ్రవాదం, మావోయిస్టుల వైపు మొగ్గుచూపకుండా చేయడానికి ప్రతి మారుమూల ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందేటట్లు చేయడం ముఖ్యమని పేర్కొంటూ, ఆ దిశలో ఇప్పుడు తీవ్రమైన కృషి జరుగుతుందన్నారు.

2009లో దేశంలో 2,258 మావోయిస్టు సంబంధిత సంఘటనలు జరగగా.. 2021లో 509 మాత్రమే జరిగాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆయుధాలు ఎంచుకునే యువకులకు ఉపాధి, విద్యను అందించడమే కాకుండా, తమ చేతుల్లో ఆయుధాలు కలిగి ఉన్న వారితో పోరాడటం ద్వారా మావోయిస్టులను నిర్మూలించ గలిగిందన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికలలోపు మావోయిజం రహిత దేశంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.