News

పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కేసరినాథ్‌ త్రిపాఠి కన్నుమూత

345views

పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కేసరినాథ్‌ త్రిపాఠి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు
భౌతికంగా దూరమయ్యారు.

త్రిపాఠి.. శ్వాస సంబంధిత, అదేవిధంగా ఆయనకు చేయి విరగడంతో గత డిసెంబర్‌ నుంచి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోవడంతో ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. గతంలో ఆయన రెండు సార్లు కరోనా బారినపడ్డారు. చాలా కాలంపాటు లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కళాశాలలో చికిత్స పొందారు.

త్రిపాఠి ప్రస్థానం ఇలా..
నవంబర్ 10, 1934న అలహాబాద్ లో జన్మించిన ఆయన జులై 2014 నుంచి జులై 2019 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నారు. ఆ సమయంలో కొద్దికాలంపాటు బీహార్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల గవర్నర్ గా అదనపు బాధ్యతలు వహించారు. ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఆరుసార్లు ఆయన ఎన్నికయ్యారు. ఆర్ధిక, వాణిజ్య పన్నుల వంటి శాఖలను నిర్వహిస్తూ జనతా పార్టీ హయాంలో 1977 నుండి 1979 వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. కవి, రచయిత అయిన ఆయన.. అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కూడా కొన్నాళ్లు పనిచేశారు. కొద్దికాలంపాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా వ్యవహరించారు.

 

సంతాపం ప్రకటించిన మోదీ, యోగీ..
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఆయన మూడు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేశారు. త్రిపాఠి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలుపుతూ ఉత్తరప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసిన నేతలలో త్రిపాఠి ఒకరని కొనియాడారు. ప్రజలకు అందించిన సేవలకు, విషయపరిజ్ఞానంతో ఆయన అందరి గౌరవాన్ని పొందారని, రాజ్యాంగ అంశాలలో ఆయనకు విశేషమైన పరిజ్ఞానం ఉందని ప్రధాని పేర్కొన్నారు. యూపీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన మృతిపై ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ట్వీట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ కూడా త్రిపాఠి మృతిపై సంతాపం తెలిపారు.