News

క్రైస్తవులను త్వరలో చంపేస్తారని హైదరాబాద్‌ పాస్టర్‌ ప్రచారం.. మోదీ, షాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు!

343views

న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బీజేపీపై హైదరాబాద్ కు చెందిన ఓ పాస్టర్ చర్చిలో చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. తనకు లభ్యమైన అమెరికన్ టాప్ సీక్రెట్ ఏజెన్సీ నివేదిక ప్రకారం 2023లో భారతదేశంలో మతపరమైన దాడులు, మారణహోమాలు జరిగి లక్షల మంది క్రైస్తవులు చనిపోతారని ఆయన ప్రసంగించిన తీరు తీవ్ర చర్చలకు దారితీసింది. హైదరాబాద్ కు చెందిన పాస్టర్ కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో అతనిపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల హైదరాబాద్‌ ముషిరాబాద్ లోని మెన్నోనైట్ బ్రెత్రెన్ బెతల్ చర్చిలో ఏర్పాటు చేసిన కొత్త సంవత్సరం వేడుకల్లో ప్రధానవక్తగా పాస్టర్ కుంట ఎడ్వర్డ్ విలియమ్స్ ప్రసంగించారు. అయితే అతను తన వ్యాఖ్యలతో అక్కడికి వచ్చిన క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేశాడు. భారత ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు.. నెబుక్ నేజర్స్ లాంటివాళ్లు అని.. క్రైస్తవులను ఇరగ బాదటం వాళ్లకి దేవుడు అప్పజెప్పిన పని అని తెలియజేయడం దుమారం రేపుతోంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల 2023 సంవత్సరంలో మారణహోమం సృష్టించబడుతోందని… ఆ దారుణ మారణకాండలో లక్షలమంది క్రైస్తవులు కత్తిపోట్లకు, తుపాకీ కాల్పులకు చనిపోతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. జర్మన్ నియంత హిట్లర్ యూదులపై జరిపిన మారణకాండను ఉదహరిస్తూ, భారతదేశంలో కూడా 2023లో అదే జరగబోతుందని, చర్చిలో వేదిక క్రింద కూర్చుని ఉన్నవారిని ఉద్దేశిస్తూ, వారిలో దాదాపు సగం మంది 2024లో కనిపించరని, 2024వ సంవత్సరాన్ని వారు చూడకుండా కత్తిపోట్లు, కాల్పులు, దెబ్బలతో చనిపోతారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు పాస్టర్ కుంట ఎడ్వర్డ్ విలియమ్స్.

ప్రపంచంలో మతపరమైన హింస విషయంలో సౌదీ అరేబియా, సిరియా దేశాలను మించి భారత్ 8వ స్థానంలో ఉందని, భారత్ వైపు ప్రపంచమంతా చూస్తుంటే దేశాన్ని పాలిస్తున్న బిజెపి మాత్రం హైదరాబాద్ నుంచి తెలంగాణను వేరు చేసి, హైదరాబాద్ ను యూనియన్ టెర్రటరీ చేయడం ద్వారా ఆ నగరం నుంచి వస్తున్న ఆదాయాన్ని లాక్కునే ప్రణాళికలు చేస్తోందన్నాడు. భారతదేశ క్రైస్తవులు.. హీరో కావడానికైనా, జీరో కావడానికైనా ఇదే అద్భుత అవకాశం అని తెలిపారు.

పాస్టర్ కుంటమ్ ఎడ్వర్డ్ విలియమ్స్ 2000 నుంచి నిరీక్షణ టెలివిజన్‌కి హోస్ట్‌గా ఉన్నారు. ఈయన భారతదేశంలో జన్మించిన కెనడియన్-అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు దివంగత ఫ్రెడిరిక్‌ ఆంటోనీ రవికుమార్ జకారియాస్ స్థాపించిన రవి జకారియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ (RZIM)లో శిక్షణ పొందినట్టు సమాచారం. ఫ్రెడిరిక్‌ ఆంటోనీ రవికుమార్ జకారియాస్‌పై గతంలో అనేక మంది మహిళలు తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇలాంటి సంస్థలో శిక్షణ పొందిన విలియమ్స్‌ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

సోర్సు – నిజం టుడే