ArticlesNews

విదేశీ వర్సిటీల క్యాంపస్ల నిర్వహణ భారత్‌లోనే.. అనుమతులు మంజూరు చేసిన యూజీసీ!

315views

విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక భారత్​లో తమ క్యాంపస్​లను ఏర్పాటు చేసుకోవచ్చు. చరిత్రలో తొలిసారి ఇందుకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంబంధిత ముసాయిదా నిబంధనావళిని గురువారం విడుదల చేసింది. అడ్మిషన్​ ప్రక్రియ, ఫీజును నిర్ణయించడం సహా ఇక్కడ వచ్చిన నిధుల్ని స్వదేశానికి పంపుకునే అవకాశాన్ని విదేశీ వర్సిటీలకు ఇచ్చింది యూజీసీ. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో నేరుగా కార్యకలాపాలు సాగించేందుకు అవకాశం కల్పించాలన్న నూతన విద్యా విధానం-2020కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఆయన చెప్పిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

భారత్​లో క్యాంపస్​ ఏర్పాటు చేసిన విదేశీ వర్సిటీలు ఆఫ్​లైన్​ విధానంలో ఫుల్​టైమ్​ కోర్సులు మాత్రమే అందించాలి. ఆన్​లైన్​ క్లాసులు, దూర విద్య కోర్సులకు వీలు లేదన్నారు. భారత దేశ ప్రయోజనాల్ని దెబ్బతీసే కోర్సుల్ని ఈ విదేశీ విశ్వవిద్యాలయాలు అందించరాదని.. దేశంలో క్యాంపస్​లు ఏర్పాటు చేయాలనుకునే విదేశీ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు.. యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని వివరించారు. తొలుత పదేళ్లు కార్యకలాపాలు సాగించేందుకు అనుమతి లభిస్తుందని.. నిర్దేశిత నిబంధనలన్నీ పాటిస్తే 9వ ఏడాదిలో అనుమతులు రెన్యువల్ అవుతాయన్నారు. విదేశీ వర్సిటీల క్యాంపస్​ల ఏర్పాటుకు సంబంధించిన తుది నిబంధనావళి ఈ నెలాఖరుకు వెలువడుతుంది.
అడ్మిషన్​ క్రైటీరియా, ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించుకునేందుకు యూనివర్సిటీలకే స్వేచ్ఛ ఉంటుందన్నారు. అయితే.. ఫీజు హేతుబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని యూజీసీ సూచిస్తోంది. సంస్థ అవసరాలకు తగినట్టుగా భారత్​ నుంచి, ఇతర దేశాల నుంచి బోధనా సిబ్బందిని నియమించుకునే అధికారం విదేశీ విశ్వవిద్యాలయాలకు ఉంటుంది. ఇతర దేశాలకు నిధుల బదిలీకి సంబంధించి.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం-ఫెమా నిబంధనలు లోబడి ఉండాలి.

ఐరోపా విశ్వవిద్యాలయాలు ఆసక్తి..
ఐరోపాలోని అనేక విశ్వవిద్యాలయాలు భారత్​లో క్యాంపస్​లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆసక్తి చూపించాయని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. అయితే ఆయా వర్సిటీల వివరాలను ఆయన వెల్లడించలేదు. క్యాంపస్​ల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నిబంధనావళిపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు, ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలకు లేఖలు రాయనున్నట్లు చెప్పారు.