News

బ్రిటన్‌ రాజుతో ప్రధాని మోదీ టెలికాన్ఫరెన్స్!

366views

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3తో ఫోన్‌లో సంభాషించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా వాతావరణ సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం వినూత్న పరిష్కారాల అన్వేషణ తదితర విషయాలపై ఇరువురు చర్చించినట్లు వెల్లడించింది. దీంతోపాటు జీ20కి భారత్ అధ్యక్షత, మిషన్ లైఫ్ తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు పేర్కొంది. బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌-3 నియమితులైన అనంతరం.. ప్రధాని మోదీ ఆయనతో మాట్లాడటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా చార్లెస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘కామన్వెల్త్ దేశాలు, వాటి మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్‌, బ్రిటన్‌ల మధ్య ‘జీవన వారధి’గా.. ద్వైపాక్షిక సంబంధాలను సుసంపన్నం చేయడంలో బ్రిటన్‌లోని భారతీయ సమాజం పాత్రను కూడా ప్రశంసించారు’ అని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఇదిలా ఉండగా.. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్‌-2 గతేడాది సెప్టెంబర్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్‌ నూతన రాజుగా చార్లెస్‌-3 బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 6న కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.