News

మతమార్పిడులపై కఠినంగా వ్యవహరించాలి – వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పాండే

350views

చట్టవిరుద్ధమైన మత మార్పిడులు, మోసాలతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇంటర్నేషనల్‌ విశ్వహిందూ పరిషత్ సెక్రటరీ జనరల్ మిలింద్ పాండే పేర్కొన్నారు. స్వస్థత సమావేశాలు, కూడికల కారణంగా.. దేశంలో ముఖ్యంగా షెడ్యూల్డ్ కమ్యూనిటీలలో ఆందోళనకరమైన వాతావరణం పెరుగుతోందని ఆయన వివరించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీల అక్రమ మతమార్పిడుల ఘటనలపై ఆయన మండిపడ్డారు. చట్టవిరుద్ధమైన మతమార్పిడులకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో కఠినమైన చట్టాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన సంఘటనలు ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ దుష్ట కార్యకలాపాలను అరికట్టడంలో ఛత్తీస్‌గఢ్ ప్రజలు కృతనిశ్చయంతో పనిచేశారని తెలిపారు. విశ్వహిందూ పరిషత్ వారికి అండగా నిలుస్తోందన్నారు. చట్టవిరుద్ధమైన మతమార్పిడులను అరికట్టడానికి అన్ని ప్రయత్నాలూ రాజ్యాంగం మరియు చట్టం పరిధిలో జరగాలని తాము నమ్ముతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీల మతమార్పిడి, గిరిజన వ్యతిరేక ఆలోచనా ధోరణిని సకాలంలో అరికట్టినట్లయితే నారాయణపూర్‌లోని అమాయక గిరిజన సమాజం వీధిన పడాల్సి వచ్చేది కాదన్నారు. గిరిజన సమాజ ప్రయోజనాలను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత కర్తవ్యం అని ఆయన సూచించారు.