News

ఉగ్రవాదానికి పాకిస్థానే కేంద్ర బిందువు – భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌

356views

భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న పాకిస్తాన్‌పై ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సామాన్య ప్రజలు, కొన్ని వర్గాలు ఉగ్రవాదానికి పాకిస్తాన్‌కు సంబంధం ఉందని ఆరోపించడం సహజంగా జరిగేదే.. కానీ భారత విదేశాంగ శాఖ మంత్రి స్థాయిలో ఉన్న జయశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటే అందులో నిజం లేకపోలేదని చాలా మంది నిపుణులు అభిప్రాయాపడుతున్నారు. తాజాగా మంత్రి జయశంకర్‌ కూడా తాను చేసిన వ్యాఖ్యలకు సమర్థించుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల ఆయన ఆస్ట్రియా జాతీయ వార్తాప్రసార సంస్థ ఓఆర్‌ఎఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి మాట్లాడారు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రస్థానం పాక్‌లో ఉందని మీరు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ఒక భారతీయ దౌత్యవేత్త హోదాలో సమర్థించుకుంటారా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు జయశంకర్‌ బదులిచ్చారు. ‘భారత పార్లమెంట్‌పై దాడి, ముంబయి వంటి నగరాల్లో దాడి చేసి భారతీయులు, విదేశీ పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. రోజూ భారత సరిహద్దు గుండా ఉగ్రమూకలు చొరబాట్లకు పాల్పడుతున్నారు. వీరందరూ పాక్‌ నుంచే వస్తున్నారు. ఇక పాక్‌ను ఉద్దేశించి ఇంకేమనాలి? ఇంకాస్త పరుష పదం వాడితే బాగుండేది అంటూ.. ఉగ్రవాదానికి కేంద్రస్థానం అనే పదం మంచిదే’ అని వ్యాఖ్యానించారు. ‘పట్టపగలే నగరాల్లో ఉగ్రవాదులకు సైన్యం తరహాలో యుద్ధతంత్రాలు అక్కడ నేర్పిస్తున్నారు. ఈ విపరీతాలను యూరప్‌ దేశాలు ఎందుకు నిలదీయవు? భారత్, పాక్‌ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందేమోననే భయం ప్రపంచానికి ఉంటే ముందుగా ఉగ్రవాదంపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టాలి’ అని ఆయన హితవు పలికారు.