
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి నిరసనగా బాసర గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు, పాఠశాలలను మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. ప్రజలు పెద్దఎత్తున రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు..
బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాసరలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే బాసర పోలీస్ స్టేషన్‌లో రేంజర్ల రాజేశ్‌పై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అమ్మవారిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.