NewsProgramms

కనుల పండువగా ఉత్తర ద్వార దర్శనాలు

334views

వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంతోపాటు యాదాద్రి, ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే భక్తులు చేరుకున్నారు. భద్రాచలంలో జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్‌ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వగా యాదాద్రిలో లక్ష్మీనృసింహస్వామి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుగ్రహించారు. భద్రాచలంలో సోమవారం తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనానికి ముందు రుగ్వేద, యజు ర్వేద, సామవేద, అదర్వణ వేదాలను పఠించిన అనంతరం ద్వారదర్శన ప్రాశస్త్యాన్ని వేదపండితులు భక్తులకు వివరించారు. సరిగ్గా 5 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడవాహన రూరుడై విచ్చేసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని భక్తులు కనులారా వీక్షించి తరించారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడిలోని మూలవరులను దర్శించుకున్నారు.