బాలీ: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఒక మార్గం కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతిని నెలకొల్పేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని మరోసారి అలాంటి ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా దేశాధినేతల సమక్షంలో జీ20 శిఖరాగ్ర సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభం సందర్భంగా బైడెన్‌ను ఆలింగనం చేసుకున్న మోదీ కొద్దిసేపు ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు.
అనంతరం ఆహారం, ఇంధనంపై జరిగిన సదస్సులో ప్రసంగించిన మోదీ కరోనా సంక్షోభం తర్వాత కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత మనందరి భుజాలపై ఉందని దేశాధినేతలకు పిలుపునిచ్చారు. ప్రపంచ రవాణ గొలుసు వ్యవస్థ శిథిలావస్థలో ఉందని నిత్యావసర వస్తువుల సంక్షోభం ప్రతి దేశంలో సవాలు విసురుతుందన్నారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ పరిణామాలు ప్రపంచంలో విధ్వంసం సృష్టించాయని.. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని దృష్టిలో ఉంచుకుని ఆ దేశ చమురు, గ్యాస్ సేకరణకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఇంధన సరఫరాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ప్రధాని అన్నారు. స్వచ్ఛమైన ఇంధనంతో పాటు పర్యావరణానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. సవాళ్లతో కూడిన జీ 20 సదస్సుకు నాయకత్వం వహించినందుకు ఇండోనేషియాను ప్రధాని మోదీ అభినందించారు. 2030 నాటికి భారత్లో సరఫరా అయ్యే విద్యుత్తులో సగం పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేయనున్నామని తెలిపారు.