
తిరుపతి: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యం ఉందో అంతే విశిష్టత స్వామివారి లడ్డూకి కూడా ఉంది. భక్తులు లడ్డు ప్రసాదం కోసం బారులు తీరతారు అంటే అతిశయోక్తి కాదు. భక్తుల ఈ బలహీనతను టీటీడీ సిబ్బందిలో కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. శ్రీవారి లడ్డూ టోకెన్ల విక్రయంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో పనిచేస్తున్న మస్తానయ్య అనే వ్యక్తి భక్తులకు టోకెన్లు ఇచ్చే సమయంలో పరిమితికి మించి టోకెన్లు జనరేట్ చేస్తూ పట్టుబడ్డాడు.
మస్తానయ్య… మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి టోకెన్లు పంచుకుంటుండగా గుర్తించి టీటీడీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో మస్తానయ్య, రాజేష్, హర్షవర్ధన్, శివ అనే నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మస్తానయ్య వద్దనుంచి అక్రమంగా విక్రయిస్తున్న 76 టోకెన్లు స్వాధీనం చేసుకుని, అరెస్టు చేశారు.
Source: Tv9



