News

గుడిలో చోరీ.. ‘సారీ, తప్పు చేశా’.. అంటూ వస్తువులు తిరిగిచ్చిన దొంగ

394views

బాలాఘాట్​: మధ్యప్రదేశ్ బాలాఘాట్​లోని జైన మందిరంలో చోరీకి పాల్పడ్డ ఓ దొంగ.. అనంతరం పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగిచ్చేయడమే కాకుండా.. క్షమాపణలు చెబుతూ లేఖ రాశాడు. బాలాఘాట్​లోని శాంతినాథ్​ దిగంబర జైన దేవాలయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి దేవాలయానికి వచ్చిన దొంగ.. 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలు అపహరించాడు. చోరికి లగ్జరీ కారులో వచ్చిన దొంగ.. హనుమాన్ భక్తుడు. ముందుగా చెప్పులు విడిచి చేతులు జోడించి దేవున్ని వేడుకున్న.. దొంగ అనంతరం వస్తువులను ఎత్తుకెళ్లాడు.

పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ప్రారంభించారు. ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తూ, ఆధారాల కోసం ప్రయత్నించారు. గతంలో చోరీలకు పాల్పడిన వారినీ విచారించారు. ఇదే సమయంలో.. ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దొంగ.. తన మనసు మార్చుకొని అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. చోరీ చేసిన వస్తువులను ఓ సంచిలో ఉంచి గ్రామ పంచాయతీ వద్ద వదిలేసి వెళ్ళాడు.

నీళ్ళ కోసం కుళాయి వద్దకు వెళ్ళిన జైన్ కుటుంబ సభ్యులు సంచిని గమనించారు. తెరిచి చూడగా అందులో అపహరణకు గురైన వస్తువులు ఉన్నాయి. అందులో ఒక లేఖ సైతం ఉంది. లేఖలో తాను తప్పు చేశానని, క్షమించమని రాశాడు. ఈ దొంగతనం మూలంగా తాను చాలా బాధలు పడ్డట్టు పేర్కొన్నాడు. జైన్​ సొసైటీకి, పోలీసులకు దీనిపై సమాచారం అందించారు స్థానికులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి