News

అణు సిద్ధాంతానికి ఆది గురువు భారతదేశమే…

243views
  • జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభలో వక్తలు

మచిలీపట్నం: అను సిద్ధాంతానికి ఆది గురువు భారతదేశమేనని, ప్రపంచానికి నాగరికతను, విజ్ఞానాన్ని నేర్పింది భారతీయులేనని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు. మచిలీపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గురువారం ఉదయం 11 గంటలకు జాగృతి వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికను ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మామిడి మురళీకృష్ణ అధ్యక్షత వహించి, ఈ ప్రత్యేక సంచిక ఉపయోగాలను వివరించారు. అలాగే, పుస్తకంలో పొందుపరిచిన పలు వ్యాసాలు గురించి వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మోటమర్రి బాబా ప్రసాద్ సంచికను ఆవిష్కరించారు.

సవరం వెంకటేశ్వరరావు తదితరులు పుస్తకంలోని అంశాలను పరిచయం చేస్తూ.. సనాతన ధర్మంలో గల రుగ్వేదం వ్యవసాయం గురించి కూడా వివరించిందని తెలిపారు. ప్రపంచానికి సున్నాను పరిచయం చేసిందని భారతీయులేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాశ్చాత్యులకు బిలియన్లు, ట్రిలియన్‌ కన్నా పెద్ద సంఖ్య లేదు. మన భారతంలో అంతకన్నా పెద్ద సంఖ్య అక్షోహిణి అనేది ఉందన్నారు. ఇటువంటి 18 అక్షోహిణిలు ఒక ఏకము… ఇలా శంఖము, మహా శంఖము వంటి అంకెలు భారతీయుల సొంతమన్నారు. భారతదేశంలో మొలకెత్తిన ప్రతి మొక్కా ఏదో ఒక వైద్యానికి పనికొచ్చే మొక్కేనని తెలిపారు.

ఈ ఆధునిక యుగంలో అత్యధిక మంది వాట్సాప్, యూట్యూబ్‌లకు పరిమితమైన ఈ తరుణంలో జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక వంటి పుస్తకాలు అటువంటి వారికి ఒక చికిత్స లాంటివని వివరించారు. సోషల్‌మీడియా ఎంత విస్తృతమైనా, ఎంత అందుబాటులో ఉన్నా పుస్తక పఠనం ప్రతీ ఒక్కరికి తప్పక అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. చంద్రశేఖర్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్‌ఎస్‌ఎస్‌) స్థానిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర సంఘచాలక్‌ చిట్టా శ్రీహరి, డాక్టర్ ధన్వంతరి ఆచార్య, పలువురు సాహిత్యకారులు, జాగృతి పాఠకులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి