
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత నేడు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ అభివృద్ధిలో నూతన దశను చూస్తున్నాయని చెబుతూ గిల్గిట్-బాల్టిస్థాన్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలు కూడా భారత్‌లో చేరాల్సిందే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
శ్రీనగర్‌లో గురువారం జరిగిన ‘శౌర్య దినోత్సవాల’లో పాల్గొన్నారు. 1947 అక్టోబరు 27న భారత వాయు సేన శ్రీనగర్‌లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంట్ ఆమోదించిన తీర్మానం ప్రకారం ఆక్రమిత ప్రాంతాలు అన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకొనే వరకు విశ్రమింపబోమని తేల్చి చెప్పారు.
రాజ్‌నాథ్ సింగ్ 1947లో బుద్గామ్ ఎయిర్‌పోర్ట్‌లో భారత సైన్యం 75వ ఎయిర్ ల్యాండ్ ఆపరేషన్ల స్మారకార్థం గురువారం శ్రీనగర్‌లో ‘శౌర్య దివస్’ వేడుకలను నిర్వహించారు. ఇది స్వతంత్ర భారత దేశంలో మొదటి పౌర-సైనిక విజయాన్ని గుర్తు చేస్తుంది. అక్టోబరు 27, 1947న, మహారాజా హరి సింగ్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య ‘విలీనం’ సంతకం చేసిన ఒక రోజు తర్వాత, జమ్మూ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ దళాలను తరిమికొట్టడానికి భారత వైమానిక దళం బుద్గామ్ విమానాశ్రయంలో భారత సైన్యాన్ని చేర్చింది.
అందుకనే అక్టోబరు 27వ తేదీని ‘పదాతిదళ దినోత్సవం’గా జరుపుకొంటారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ‘శౌర్య దివస్’ దేశానికి ధైర్యవంతుల పరాక్రమాన్ని గుర్తుచేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని, ఐక్యత, అంకితభావంతో దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రజలను ప్రేరేపిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
“మనం ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. భవిష్యత్తులో మన అభివృద్ధికి విఘాతం కలిగించే విభజన శక్తులకు వ్యతిరేకంగా కలిసి పోరాడాలని సంకల్పించుకోవాలి” అని ఆయన పిలుపిచ్చారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కొన్ని భూభాగాలు ఇంకా అభివృద్ధికి నోచుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తూ, ఆయా ప్రాంతాలలో జరుగుతున్న అమానుష సంఘటనలకు పాకిస్తాన్ ఏ బాధ్యత వహించవలసి ఉంటుందని రక్షణ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు పాకిస్తాన్ తగు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.
Source: Nijamtoday