
న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చింజిన్ గూగుల్‌కు భారత్‌లో గట్టి షాక్ తగిలింది. కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. ఇందుకు ప్రతిగా రూ.1337.76 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని హితవు పలికింది.
స్మార్ట్ ఫోన్ పనిచేయాలంటే దానికి ఓఎస్ కావాలి. అలాంటి ఓఎస్‌ల్లో ఆండ్రాయిడ్ ఒకటి. దాన్ని గూగుల్ 2005లో కొనుగోలు చేసింది. మొబైల్ కంపెనీలు దాదాపు ఇదే ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుతున్నాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు, ప్లే స్టోర్, గూగుల్ సెర్చ్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ తదితర అప్లికేషన్లను గూగుల్ కలిగి ఉందని సీసీఐ పేర్కొంది. వీటి ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను గూగుల్ అవలంబిస్తోందని పేర్కొంటూ జరిమానా విధించింది.





