
అర్దబిల్: ఇరాన్‌లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్‌సా అమిన్ అనే యువతి పోలీస్ కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయిన. సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీని కీర్తించే గీతం పాడనందుకు 16 ఏళ్ల బాలికను ఆ దేశ భద్రతా సిబ్బంది కొట్టి చంపారు.
వాయువ్య అర్దబిల్ నగరంలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 13న అద్దాబిల్ లోని షహేద్ గర్ల్‌హైస్కూల్‌లో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఆ దేశ సుప్రీం నేతను కీర్తించే గీతాన్ని పాడాలని బాలికలను బలవంతం చేశారు. అస్రా పనాహి అనే 16 ఏళ్ల బాలిక నిరాకరించగా క్లాస్‌రూమ్‌లో అందరి ఎదుట ఆమెను దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన ఆ బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే భద్రతా దళాలు కొట్టడం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు.
Source: Nijamtoday





