
అదాలజ్: దేశంలో 5జి సాంకేతికత విద్యావ్యవస్థను సమున్నత స్థాయికి తీసుకువెళుతుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తెలిపారు. ఇకపై స్కూళ్ళ రూపురేఖలు మారుతాయి… అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాల స్థాయిలో విద్యాభ్యాసానికి వీలేర్పడుతుందని చెప్పారు. విద్యావ్యవస్థ తదుపరి దశను అందుకునేందుకు 5జి టెక్నాలజీ దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
గుజరాత్‌లోని అదాలజ్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిభాయుత స్కూళ్ళ లక్షం కార్యక్రమాన్ని ఉద్ధేశించి ప్రధాని ప్రసంగించారు. విద్యాబోధన ఇకపై హైటెక్ రీతిలో సాగేందుకు రంగం సిద్ధమైంది. స్మార్ట్ సౌకర్యాలు, స్మార్ట్ క్లాసురూంలు, స్మార్ట్ టీచింగ్ ప్రక్రియల స్థాయి దాటుతుందని, సాంకేతికను మేళవించుకుని విద్యాబోధన జరగడం ద్వారా విద్యార్థులకు మరింతగా ప్రామాణిక విద్య అందుతుందని ప్రధాని తెలిపారు.
కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం ఆంగ్ల దాస్య మనసత్వత్వం నుంచి భావితరాలను మళ్ళిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. తాను భాష గురించి ప్రస్తావించడం లేదు కానీ ఇంగ్లీషు చుట్టూ అల్లుకుని ఉన్న దాస్య వైఖరి నుంచి దేశం బయటపడేందుకు దారితీస్తుందని ప్రధాని తెలిపారు. ఇంగ్లీషు భాష కేవలం సమాచార మాధ్యమంగా భావించినా దీనిని ఇప్పుడు మేధావి లక్షణం అనే స్థాయి ఏర్పడిందని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గుజరాత్‌లో విద్యారంగ భావి అవసరాల లక్షాల దిశలో ఇప్పుడు ఈ గణనీయ కార్యక్రమం ఏర్పాటు అయిందని ప్రశంసించారు.
Source: Nijamtoday





