
ధర్మవరం: ఏపీలోని సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, పోతుల నాగేపల్లి ఎంపీ యుపిఎస్ పాఠశాలలో శనివారం ఘనంగా అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ పేపరు బాయ్ నుంచి శాస్త్రవేత్త , రాష్ట్రపతి వరకు ఎదిగిన అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న జన్మించారని తెలిపారు. బాల్యంలోనే అష్టకష్టాలు పడ్డ అబ్దుల్ కలాం.. కృషి, పట్టుదలతో ఉన్నత చదువులు చదివారన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశీలి, రచయిత, మిసైల్ మ్యాన్ అయిన అబ్దుల్ కలాం… పిల్లలంటే ఆయనకు ఎంతో ఇష్టమని చెప్పారు. కలాం పుట్టిన ఈ రోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. 1998 వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికన్ సాటిలైట్ కు దొరక్కుండా పోక్రాన్ అనే ప్రదేశంలో ఆపరేషన్ శక్తి పేరుతో విజయవంతంగా న్యూక్లియర్ టెస్ట్ చేయడంలో కలాం కీలక పాత్ర పోషించారని తెలిపారు. విద్యార్థులంతా అబ్దుల్ కలాం జీవిత చరిత్రను తెలుసుకొని, ఆయనను మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అన్నం, అరవింద్, చలపతి, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.





