News

నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం

390views
  • త్వ‌ర‌లో చెన్నై- మైసూరు మధ్య అయిదో రైలు

ఉనా: దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్ళు ప్రారంభం కాగా, గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని అంబ్ అందౌరా స్టేషన్ వరకు నడిచే నాలుగో వందే భారత్ రైలును ప్రారంభించారు.

ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని అందౌరా రైల్వే స్టేషన్‌ మధ్య నడిచే ఈ రైలును ఉనా జిల్లాలో ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ-ఉనా మధ్య అందుబాటులోకి వచ్చే ఈ వందే భారత్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా వాసులకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కాగా, ఈ కార్యక్రమంలో హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి, హమీపూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

‘‘ఢిల్లీ-ఉనా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా ప్రజలకు ఎంతో ప్రయోజనం.. ఢిల్లీ లేదా ఇతర నగరాలకు వెళ్ళే హరియాణా వాసులకు ఈ రైలు వల్ల ఎంతో మేలు జరుగుతుంది’’ అని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ రైలు ఉదయం 5.50 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి, ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్ళీ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి 6.25 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకోనుంది. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటుంది.

మరోవైపు చెన్నై- మైసూరు మధ్య అయిదో వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ గత నెలలో మూడో వందే భారత్ రైలును ప్రారంభించారు. గాంధీ నగర్-ముంబై మార్గంలో ఈ రైలు నడుస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి