
న్యూఢిల్లీ: చాలా దేశాల ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉన్న సమయంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ సాపేక్షంగా మెరుగైన స్థితిలో ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆసియా-పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వృద్ధి నెమ్మదిస్తోందని, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోందని ఆయన చెప్పారు. కృష్ణ శ్రీనివాసన్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను చూడమని చెప్పారు. ఇది సర్వత్రా వేధిస్తున్న సమస్య అని తెలిపారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వృద్ధి నెమ్మదిస్తోందన్నారు.
అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు ఆర్థిక వ్యవస్థ గల దేశాలు ఈ ఏడాది కానీ, వచ్చే సంవత్సరం కానీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని చెప్పారు. ద్రవ్యోల్బణం విపరీతంగా ఉందన్నారు. మొత్తం మీద పరిస్థితి ఇదేనని తెలిపారు. ‘‘దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోంది. ఈ నేపథ్యంలో భారత దేశం మెరుగ్గా ఉంది. ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు భారత దేశం సాపేక్షంగా మెరుగైన స్థితిలో ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
Source: Nijamtoday





