News

‘హిజాబ్’ పై ఎటూ తేల్చని సుప్రీం.. భిన్న తీర్పులిచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు

508views

న్యూఢిల్లీ: కర్ణాటక హిజాబ్​ వివాదాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎటూ తేల్చలేదు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు వెలువ‌రించారు. హిజాబ్​పై కర్ణాటక ప్రభుత్వ నిషేధాన్ని కొనసాగించేలా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన అపీళ్ళ‌న్నింటినీ కొట్టివేయాలని ప్రతిపాదించారు. మరోవైపు.. ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ సుధాన్షు ధూలియా ఇందుకు భిన్నంగా తీర్పు రాశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ.. హిజాబ్ బ్యాన్​పై అపీళ్ళ‌ను స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు.

విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇంతకుముందు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో 10 రోజుల పాటు వాదనలు సాగగా, పిటిషనర్ల తరఫు 21 మంది న్యాయవాదులు, ప్రతివాదుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ వాదించారు.

సుప్రీంకోర్టులో హిజాబ్‌కు మద్దతుగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ముస్లిం బాలికలు హిజాబ్ లేకుండా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని.. దీంతో వారి చదువులకు ఆటంకం ఏర్పడుతుందని.. చాలా మంది పాఠశాలకు వెళ్లడమే మానేశారని సుప్రీంకోర్టుకు విన్నవించారు. పాఠశాలలో, కళాశాల్లలో సమానత్వం, సమగ్రతకు భంగం కలిగించే దుస్తులను నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఫిబ్రవరి 5 నాటి ఉత్తర్వుల్లోని అంశాలను సుప్రీంకోర్టుకు వివరించారు ప్రభుత్వం తరుపున న్యాయవాదులు.

ఈ కేసును ముందుగా రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని సమర్థిస్తూ కొందరు వ్యక్తులు ఆందోళనలు చేయడం ఓ పథకంలో భాగమని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. మార్చి 15న కర్ణాటకలోని ఉడుపిలోని ప్రభుత్వం ప్రీ యూనివర్సిటీ గర్ల్స్ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థలు తరగతి గదులలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్​ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఈ హిజాబ్ వివాదం ఉడుపి నుంచి కర్ణాటకలోని చిక్ మంగళూర్, మాండ్యా, బాగల్ కోట్, దక్షిణ కన్నడ జిల్లా, బెంగళూర్, తుముకూరు, చిక్ బల్లాపూర్, శివమొగ్గ జిల్లాలకు కూడా వ్యాపించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి