News

మొదటి భార్యకు న్యాయం చేయలేని ముస్లిం….రెండోపెళ్ళి చేసుకునే హక్కు లేదు… అలహాబాద్ హైకోర్టు తీర్పు

341views

అలహాబాద్: మొదటి భార్య, ఆమెకు పుట్టిన సంతానాన్ని చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో వివాహం చేసుకునే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇస్లామిక్​ చట్టం ప్రకారం ముస్లింలకు మొదటి భార్య ఉండగానే.. రెండో పెళ్ళి చేసుకునే హక్కు ఉందని హైకోర్టు తెలిపింది. అయితే, మొదటి భార్య అనుమతి లేకుండా భర్త.. రెండో పెళ్లి చేసుకోవడం.. మొదటి భార్యపై కక్ష తీర్చుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది.

భార్యకు ఇష్టం లేకుండా తనతో కలిసి ఉండమని కోర్టు ద్వారా కోరే హక్కు వారికి లేదని పేర్కొంది. అలాచేస్తే అది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని హైకోర్టు బెంచ్​ తెలిపింది. ఈ మేరకు అజీజుర్‌ రెహమాన్‌ అనే వ్యక్తి అప్పీలును తోసిపుచ్చుతూ జస్టిస్‌ ఎస్​పీ కేశర్వణి, జస్టిస్‌ రాజేంద్రకుమార్‌లతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ ఈ తీర్పు వెలువరించింది.

ఆ కేసు వివ‌రాలివి…

అజీజుర్ రెహమాన్, హమీదున్నిషా 12 మే 1999న వివాహం చేసుకున్నారు. హమీదున్నిషా తన 93 ఏళ్ళ తండ్రిని, ముగ్గురు పిల్లలనూ చూసుకుంటూ ఇంట్లో ఉంటుంది. ఆమెకు తెలియకుండా రెహమాన్​.. రెండో పెళ్ళి చేసుకున్నాడు. తనతో కలిసి ఉండాలని మొదటి భార్యను కోరుతూ ఫ్యామిలో కోర్టులో పిటిషన్ వేశాడు. దాన్ని కోర్టు నిరాకరించింది. ఖురాన్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఒక ముస్లిం తన భార్య, పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతే.. అతను మ‌ళ్ళి పెళ్ళి చేసుకోవడానికి అనుమతించబోమని సంత్ కబీర్‌నగర్ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది.

భార్యను తనతో ఉండమనే హక్కు రెహమాన్​కు లేదని తేల్చి చెప్పింది. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు రెహమాన్. మొదటి భార్య హమీదున్నీషా అలియాస్ షఫీకున్నీషాకు ఇష్టం లేకుండా.. తన భర్తతో కలిసి ఉండాలని కోరేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఫిటిషన్​ను కొట్టివేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి