
కశ్మీర్: జమ్ము కశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రవాదుల అలజడి రేగింది. వరుస పేలుళ్ళతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఉదంపుర్‌లో సంభవించిన వరుస పేలుళ్ళు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం రాత్రి ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న ఓ బస్సులో పేలుడు సంభవించింది. రాత్రి 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్‌బంక్‌లోని సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు బస్సు అక్కడికి వచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే ఉదంపుర్లోని మరో బస్సులో పేలుడు సంభవించింది. ఉదయం ఆరు గంటల సమయంలో బస్టాండ్‌లో ఉన్న ఓ బస్సులో పేలుడు జరిగింది. ఉదంపుర్ నుంచి రామ్‌నగర్‌కు ఈ బస్సు వెళ్ళాల్సి ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే, బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఇది ప్రమాదం కాదని, పేలుళ్ళే అని నిర్ధరించారు పోలీసులు. ఏ రకమైన బాంబులను ఉపయోగించారనే విషయం తెలియాల్సి ఉందని డీఐజీ సులేమాన్ చౌదరి పేర్కొన్నారు. పోలీసులతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నాయి.
Source: EtvBharat





