News

కూనో పార్క్‌లోకి చీతాల‌ను వ‌దిలిన ప్రధాని మోదీ

356views

గ్వాలియ‌ర్‌: న‌మీబియా నుంచి తెచ్చిన ఎనిమిది చీతాల‌ను ఇవాళ ప్ర‌ధాని నరేంద్ర మోదీ కూనో పార్క్‌లోకి విడుదల చేశారు. ప్ర‌త్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియ‌ర్‌కు ఇవాళ ఉద‌యం చేరుకున్నాయి. ఆ త‌ర్వాత వాటిని ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ల‌లో కూనో ఫారెస్ట్‌కు త‌ర‌లించారు.

కాసేప‌టి క్రితం మోదీ ఆ చీతాల‌ను పార్క్‌లోకి విడుద‌ల చేశారు. ప్ర‌ధాని మోదీ ఇవాళ 72వ పుట్టిన రోజు జ‌రుపుకొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చీతాల‌ను విడుద‌ల చేశారు. దీంతో భార‌త్‌లో దాదాపు 70 ఏళ్ళ‌ త‌ర్వాత చీతాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షియోపూర్ జిల్లాలో కూనో జాతీయ పార్క్ ఉంది. ఎనిమిది చీతాల‌కు రేడియో కాల‌ర్ల‌ను ఇన్‌స్టాల్ చేశారు. వాటిని శాటిలైట్ ద్వారా మానిట‌ర్ చేయ‌నున్నారు. పార్క్‌లో కూడా మానిట‌రింగ్ బృందాల‌ను ఏర్పాటు చేశారు.

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుత పులులు మన అతిథులని, కునో-పాల్పుర్ నేషనల్ పార్క్‌ వాటి ఇల్లు అని ప్రధాన మంత్రి మోదీ చెప్పారు. వీటిని తీసుకురావడం కోసం ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తోందని, దీని వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.

స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న సమయంలో వీటిని తీసుకొచ్చామని, నూతన శక్తితో వీటిని పరిరక్షిస్తామని చెప్పారు. మన దేశంలో గతంలో ఆసియాటిక్ చిరుత పులులు ఉండేవి. అయితే ఇవి అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం ప్రకటించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి