News

గులాం నబీ ఆజాద్ కు ఉగ్రవాదుల బెదిరింపులు

180views

మ్ముకశ్మీర్‌ నేత గులాం నబీ ఆజాద్ ‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇటీవల కాలంలో కాంగ్రెస్ ‌ను వీడాక సొంత పార్టీ స్థాపించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు ర్యాలీలు, సభలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆయుధాలను వీడాలని పిలుపునిచ్చారు. వాటివల్ల కేవలం వినాశనం తప్ప మరేమీ ఉండదన్నారు. దీంతో ఓ ఉగ్రసంస్థ ఆజాద్ ‌ను ద్రోహిగా పేర్కొంటూ బెదిరింపు సందేశాన్ని పంపింది.

దక్షిణ కశ్మీర్‌లోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన అనంతనాగ్ ‌లోని దాల్‌ బంగ్లా లాన్స్ ‌లో నిన్న ఆజాద్‌ ఓ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. తుపాకీ సంస్కృతి కొన్ని తరాలకు హాని చేస్తుందన్నారు. మరింత మంది కశ్మీరీ యువకులు హింసకు బలికాకూడదని పేర్కొన్నారు. హింస కారణంగా కశ్మీర్‌ లోయలో వేలమంది మహిళలు భర్తలను కోల్పోతున్నారని.. లక్షల మంది పిల్లలు అనాథలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ”తుపాకులు చేతపట్టిన వారికి నాదొక విన్నపం. ఒక్కసారి ఆలోచించండి. ఆ తుపాకీ పరిష్కారం కాదు. తుపాకీ నుంచి కేవలం వినాశనం, కష్టాలే వస్తాయి” అని వివరించారు.

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ అసాధ్యమని ఆజాద్‌ పునరుద్ఘాటించారు. పార్లమెంట్‌లో 2/3 వంతు మెజార్టీ ఉండాలని.. లేకపోతే సుప్రీం కోర్టు ద్వారా ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు. కానీ, గత మూడేళ్లలో సుప్రీం కోర్టు దీనికి సంబంధించిన కేసుల్లో వాదనలు కూడా వినలేదన్నారు. తనకు ఓ ఉగ్ర సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆజాద్‌ తెలిపారు. కానీ, ఆ బెదిరింపులు తాను అనుసరించే శాంతి మార్గం నుంచి తనను తప్పించలేవని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.