
-
పాండిచ్చేరితోపాటు 7 రాష్ట్రాల నుండి కళాకారులు రాక
-
మొత్తం 88 కళాబృందాలు
-
జానపద కళారూపాలకు పెద్దపీట
తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వాహనసేవల్లో అపురూపమైన కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కళారూపాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదికి చెందిన 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుండి కళాకారులు వాహనసేవల్లో పాల్గొననున్నారు. వాహనసేవల సమయంలో విశిష్టతను తెలిపేందుకు ప్రముఖ పండితులు వ్యాఖ్యానం చేస్తారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరితో పాటు ఉత్తరాదికి చెందిన మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వివిధ కళారూపాలు ప్రదర్శించేందుకు కళాకారులు విచ్చేయనున్నారు. ఆయా రాష్ట్రాల కళాకారులు స్థానిక జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు.
వాహన సేవల్లో హిందూ ధర్మప్రచార పరిషత్ నుండి 50, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి 24, అన్నమాచార్య ప్రాజెక్టు నుండి 14 కలిపి మొత్తం 88 కళాబృందాలు పాల్గొననున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి 63 బృందాల్లో కళాకారులు పాల్గొంటారు. వీరు గరగల భజన, చెక్క భజన, పిల్లన గ్రోవి భజన, తప్పెట గుళ్లు, లంబాడీ నృత్యం, కోలాటం, కీలుగుర్రాలు, బళ్లారి డప్పులు కళారూపాలను ప్రదర్శిస్తారు. తెలంగాణ నుండి రెండు బృందాలు చెక్క భజన, కోలాటం ప్రదర్శిస్తాయి. కర్ణాటక నుండి ఐదు బృందాలు విచ్చేసి మహిళా తమటే, డొల్లుకునిత, పూజకునిత, సోమనకునిత, కమసల కళారూపాలను ప్రదర్శిస్తారు.
తమిళనాడు నుండి 12 బృందాలు రానున్నాయి. వీరు కరకట్టం, పంపై, ఒయిలాట్టం, పోయికల్ కుత్తిరై, మాయిలాటం, కాళియాట్టం, కోలాటం ప్రదర్శిస్తారు. మహారాష్ట్ర నుండి రెండు బృందాలు డిండి భజన, డ్రమ్స్ వాయిద్యం, ఒడిశా నుండి ఒక బృందం, కేరళ నుండి ఒక బృందం, పాండిచ్చేరి నుండి రెండు బృందాలు స్థానిక కళారూపాలను ప్రదర్శించనున్నారు.
Source: TTDNews