
* టోల్ ప్లాజాల వద్ద ఆగే పని లేకుండా ఆటోమేటిగ్గా టోల్ చెల్లించే అధునాతన విధానం దిశగా కేంద్రం అడుగులు
టోల్ ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీని ద్వారా టోల్ ప్లాజా వద్ద వాహన రద్దీని తగ్గించడంతో పాటు టోల్ వర్తించే హైవేలపై, ప్రయాణించిన దూరానికే టోల్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని గడ్కరీ తెలిపారు. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన దీనిపై మాట్లాడారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపకుండానే ఆ వాహనం నంబర్ ప్లేట్ ను రీడ్ చేసే కెమెరాల ద్వారా టోల్ ఫీజు ఆటోమేటిక్ గా చెల్లించే విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నామన్నారు. ఈ సాంకేతికత ద్వారా ట్రాఫిక్ ను అరికట్టడమే కాకుండా వినియోగించిన దానికే చెల్లించే విధానం తీసుకురానున్నట్లు చెప్పారు. టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ టోల్ చెల్లింపుల వ్యవస్థను తీసుకురావడం కోసం రెండు ఆప్షన్లను పరిశీలిస్తున్నామని గడ్కరీ తెలిపారు. అందులో ఒకటి వాహనాల్లో జీపీఎస్ ట్రాకర్ కాగా.. ఇంకోటి నంబర్ ప్లేట్ విధానమని చెప్పారు. నంబర్ ప్లేట్ టెక్నాలజీ వల్ల భవిష్యత్ లో టోల్ ప్లాజా అనేదే ఉండదని, ఆ స్థానంలో అధునాతన కంప్యూటరైజ్డ్ డిజిటల్ సిస్టమ్ ఉంటుందని గడ్కరీ వివరించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





