ArticlesNews

“భారతదేశ యువ దధీచి” జతీంద్రనాథ్ దాస్

205views

ది ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉండిన కాలం. స్వాంతంత్ర్య సమరంలో పాల్గొన్న స్వాతంత్ర్య యోధులననేకుల్ని అరెస్టు చేసి జైళ్లలో నిర్భంధించేవారు. వారు రాజకీయ ఖైదీలు అయినప్పటికీ ఖూనీకోర్లు, దొంగలు, బందిపోట్లు వంటి ఇతర ఖైదీలకు చేసినట్లుగానే వారి బట్టలుతీసేసి రెండు గోచీలు ఇచ్చేవారు. మూరెడు చదరంగల రెండు తువ్వాళ్లు ఇచ్చేవారు. పడుకునేందుకు చిన్న ఈత చాప ఇచ్చేవారు. అన్నం తినడానికి మట్టిచట్టి, నీళ్లు త్రాగటానికి ఓ మట్టిముంత, మలమూత్ర విసర్జనకు మరొక చట్టి మాత్రమే ఇచ్చేవారు. కాలికి లావుపాటి కడియం, మెడకు మరొక ఇనుపకడియం వేసి ఒక కొయ్యముక్కను దూర్చేవారు. మట్టితోనే పండ్లు తోముకోవాలి. అధికార్లు నిర్ణయించిన టైముకే మలవిసర్జన చేయాలి. స్నానానికి మూడునాలుగు ముంతల నీరు మాత్రమే ఇస్తారు. తినటానికి ఓ రాగిసంకటిముద్ద ఇచ్చేవారు. ఆ ముద్దలో పుల్లలు, రాళ్లు, మట్టి వుండేవి. ఆకులలములతో ఉడకబెట్టిన పులుసునీరు ఇచ్చేవారు. వాటిలోని పురుగులనైనా కడిగేవాళ్ళు కాదు. అలా తయారయిన ఆ పులుసునీళ్లలో ఉడికి చచ్చిన పురుగులు తేలుతుండేవి. మొలత్రాడు, జంధ్యము తీసేసేవారు. తల బోడిచేసేవారు. ఎన్ని విధాలుగా మనుషులను అగౌరవ పరచగలమో, అన్నివిధాల అగౌరవపరుస్తూ దేహబలాన్ని, మనోబలాన్ని అణగద్రొక్కి, సదరు ఖైదీలు దేశసేవకు, మానవసేవకు ప్రయత్నించకుండా వుండేలాగుండే జైలు పద్ధతిని ఆ రోజుల్లో ఆంగ్లేయ సామ్రాజ్య వాదులు తయారు చేశారు. ఇదీ ఆనాడు భారతదేశంలోని జైళ్లలో భారతీయ ఖైదీల దుస్థితి.

అప్పట్లో జైళ్లలో భారతీయుల పరిస్థితి అత్యంత దయనీయంగా, అమానవీయంగా, అమర్యాదకరంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిలో భారతీయ రాజకీయ ఖైదీలు మనుషులే కాదన్నట్లుండేది. భారతీయ ఖైదీలు జైలులో ధరించే యూనిఫాంలు రోజుల తరబడి ఉతుక్కునే అవకాశం ఉండేది కాదు. వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు తిరుగాడుతుండేవి. భారతీయ ఖైదీలకు వార్తాపత్రికలు, వ్రాసుకోవడానికి కాగితం వంటి సామగ్రిని కూడా అందించేవారు కాదు. అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న బ్రిటిష్ ఖైదీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండేది.

ఆ దయనీయ స్థితికి వ్యతిరేకంగా ఓ 24 ఏళ్ళ యువకుడు నిరసన గళం విప్పాడు. ఆమరణ నిరాహర దీక్ష చేశాడు. అతనే జతీంద్ర నాథ్ దాస్. జతిన్ దాస్ అని కూడా పిలుస్తారు. జతిన్ దాస్ ఒక భారతీయ స్వాతంత్ర్య విప్లవయోధుడు. 63 రోజుల నిరాహార దీక్ష తర్వాత 1929 సెప్టెంబరు 13న, ఇదే రోజున లాహోర్ జైలులో మరణించాడు. అతని మరణవార్త తెలియగానే యావద్దేశం ఆగ్రవేశాలతో ఊగిపోయింది. ఆయన అంతిమయాత్రకు తరలివచ్చిన లక్షలాది మందిని చూసి బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడిపోయింది. గజగజ వణికిపోయింది.

జతిన్ దాస్ ఆత్మార్పణ కారణంగా రాజకీయ ఖైదీలకు సౌకర్యాలు కావాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఫలితంగా ఎ, బి, సి తరగతులేర్పడ్డాయి. తదనంతరం జరిగిన సత్యాగ్రహోద్యమాల్లో వందలు వేల కొలది వాలంటీర్లు జట్లు జట్లుగా జైళ్లకు వెళ్ళేవారు. జైల్లో కూడా అందరూ కలిసే వుండేవారు. జైల్లో వేదాలు, వేదాంతాలు అధ్యయనం చేసినవారున్నారు. ‘స్వీయ చరిత్రలు’ వ్రాసుకున్నవారున్నారు. జైలు జీవితం మనస్సుకు, శరీరానికి మంచి విశ్రాంతి నిచ్చిందనేవారు, ప్రశాంత ఆలోచనలకు తావిచ్చిందన్నవారు చాలామంది ఉన్నారు. ఇవి తర్వాత తర్వాత జైలు పరిస్థితులలో వచ్చినమార్పులు. రాజకీయ ఖైదీలకు ఏమాత్రం అసౌకర్యాలున్నా, వారి పట్ల అగౌరవం చూపినా, దేశంలో బ్రహ్మాండమైన ఆందోళన చెలరేగుతుందనే భయం జైలు అధికార్లకు వుండేది. ఈ పరిణామాలన్నీ జతీంద్రనాథ్ దాస్ ఆత్మబలిదాన ఫలితమే.

జతీంద్రనాథ్ దాస్ 1904 లో కలకత్తాలోని మూలికా కాయస్థ కుటుంబంలో జన్మించారు. తన చిన్న వయస్సులోనే బెంగాల్‌లోని అనుశీలన సమితిలో చేరాడు. 1921 లో మహాత్మాగాంధీ గారి పిలుపునందుకుని కేవలం 17 సంవత్సరాల వయస్సులో సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. జతిన్ దాస్ తెలివైన విద్యార్థి. మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణత సాధించాడు. కలకత్తాలోని బంగబాసి కళాశాలలో B.A చదువుతుండగా 1925 నవంబర్ లో,‌ దాస్ రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న అభియోగంపై అరెస్టు చేయబడ్డాడు. మైమెన్సింగ్ సెంట్రల్ జైలు (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది) లో ఖైదు చేయబడ్డాడు.

ఆ జైలులోని పరిస్థితులకు నిరసనగా జతీంద్ర 21 రోజులపాటు నిరాహార దీక్ష చేయటంతో జైలు సూపరింటెండెంట్ దిగివచ్చి క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత దేశంలోని ఇతర విప్లవకారులతో కూడా జతీంద్రకు సంబంధాలు ఏర్పడ్డాయి. భగత్ సింగ్ తదితరుల కోసం బాంబు తయారీకి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో జతీంద్రను లాహోర్ కుట్రకేసులో ఇరికించి 1929 జూన్ 14న మళ్లీ అరెస్టు చేసి లాహోర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఆప్పుడు ఆ జైలులో భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులు కూడా ఉండేవారు.

ఆ జైలులో కూడా తెల్లఖైదీలు, భారతీయుల మధ్య వివక్షను, జైలులో ఉన్న దారుణమైన పరిస్థితులను నిరసిస్తూ, రాజకీయ ఖైదీల హక్కుల కోసం జతీంద్ర ఇతర విప్లవ పోరాట యోధులతో కలిసి ఆమరణదీక్షకు దిగాడు. తొలుత పట్టించుకోని జైలు అధికారులు పరిస్థితి చేయి దాటిపోకుండా అతనికి, ఇతర స్వాతంత్ర్య యోధులకు బలవంతంగా ఆహారం అందించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. జతిన్ దాస్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో భయపడ్డ జైలు అధికారులు జతీంద్రను విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం పట్టుదలకు పోయి అందుకు నిరాకరించింది. కావాలంటే బెయిల్ ఇద్దామని ప్రతిపాదించింది. కానీ లక్ష్యం సాధించకుండా దీక్ష విరమించేందుకు జతీంద్రనాథ్ అంగీకరించలేదు. ఫలితంగా 63 రోజుల సుదీర్ఘ పోరాటం అనంతరం 1929 సెప్టెంబరు 13న జతీంద్రనాథ్ అమరుడయ్యాడు. ఈ వార్త తెలియగానే లాహోర్ జైలు వద్ద పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అంత్యక్రియలు కోల్ ‌కతాలో చేద్దామని నిర్ణయించారు. ఆ అమరవీరుడి పార్థివదేహాన్ని తీసుకు రావటానికి సుభాష్ చంద్రబోస్ 6వేల రూపాయలు పంపించారు.

అంతిమయాత్ర లాహోర్ నుంచి కోల్ కతాకు రైలులో బయలుదేరింది. అంతిమయాత్రకు దుర్గాభీ నాయకత్వం వహించాడు. జతిన్ దాస్ ‌కి నివాళులర్పించడానికి వేలాది మంది ప్రజలు రైల్వే స్టేషన్‌లకు చేరుకున్నారు. కాన్పూరులో నెహ్రూ, అలహాబాద్ లో కమలానెహ్రూ రైలునాపి జతీంద్రకు అంజలి ఘటించారు. కోల్ కతా హౌరా స్టేషన్ లో సుభాష్ చంద్రబోస్ స్వయంగా వెళ్ళి పార్థివదేహాన్ని స్వీకరించారు. రైల్వే స్టేషన్ నుంచి శ్మశానవాటిక దాకా కోల్ కతా అంతా జనసంద్రంతో నిండిపోయింది. సుమారు 6లక్షల మంది ప్రజలు ఆ రోజు జతీంద్ర అంతిమయాత్రలో పాల్గొన్నారని బ్రిటిష్ ప్రభుత్వం అంచనా వేసింది. అంతమందిని చూసి అదిరిపోయిన బ్రిటిష్ పాలకులు ఆ తర్వాత మరే విప్లప వీరుడు చనిపోయినా వారి మృతదేహాలను బంధువులకు అప్పగించలేదు.

దేశంలోని దాదాపు ప్రతి నాయకుడూ జతీంద్రకు నివాళులర్పించారు. మొహమ్మద్ ఆలం మరియు గోపి చంద్ భార్గవలు పంజాబ్ శాసన మండలికి రాజీనామా చేశారు. లాహోర్ ఖైదీలపై ప్రభుత్వాధికారులు సాగిస్తున్నఅమానవీయతకు వ్యతిరేకంగా సెంట్రల్ అసెంబ్లీని వాయిదా వేయాలని మోతీలాల్ నెహ్రూ ప్రతిపాదించారు. ” సమాజ హితం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సుప్రసిద్ధ పౌరాణిక యోగి దధీచిని స్మరిస్తూ జతీంద్రనాథ్ ను “భారతదేశ యువ దధీచీ” గా అభివర్ణించారు సుభాష్ చంద్రబోస్. జతీంద్రనాథ్ లోని ధైర్యం, పౌరుషం, త్యాగం అనన్య సామాన్యమైనవి. జతీంద్రనాథ్ దాస్ చిరస్మరణీయుడు.

* నేడు జతీంద్రనాథ్ ప్రాణార్పణ చేసినరోజు

– శ్రీరాంసాగర్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.