News

వివాదాస్పద జర్నలిస్టుకి సుప్రీం బెయిల్

368views

త్తరప్రదేశ్‌లోని హథరాస్ ‌లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందినట్లుగా ప్రచారమైన దళిత యువతి ఉదంతాన్ని కవర్‌ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్ధీఖ్‌ కప్పన్ ‌కు సుప్రీంకోర్టు ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కప్పన్ ‌ను మూడు రోజుల్లోపు ట్రయల్‌ కోర్టులో హాజరుపర్చి.. బెయిల్ ‌పై విడుదల చేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే బెయిల్ ‌పై విడుదలైన తర్వాత కప్పన్‌ ఆరువారాల పాటు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, తన పాస్ ‌పోర్టును పోలీసులకు అప్పగించాలని, ప్రతి సోమవారం పోలీసు స్టేషన్‌లో రిపోర్ట్‌ చేయాలని కూడా సదరు జర్నలిస్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

అంతకముందు కప్పన్ తన బెయిల్‌ కోసం అలహాబాద్‌ హైకోర్టు లఖన్ వూ ధర్మసనానికి అప్పీలు చేసుకున్నాడు. లఖన్ వూ బెంచి ఆ దరఖాస్తును కొట్టేయడంతో కప్పన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

కప్పన్‌ అభ్యర్థనపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే కప్పన్‌ దేశంలో మత విభేదాలను, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కుట్రలో భాగస్వామి అని ఉత్తర‌ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆయనకు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా/ క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ/సీఎఫ్‌ఐ) నాయకులతో సంబంధాలు ఉన్నాయనీ ఆరోపించింది. ఈ వివరణలను పరిశీలించిన ధర్మాసనం.. అతడికి బెయిల్ మంజూరు చేసేందుకు అంగీకరిస్తూ పలు షరతులు విధించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.