News

ఎలాంటి సమస్యనైనా స్నేహం పరిష్కరిస్తుంది: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

349views

న్యూఢిల్లీ: స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలదని.. భారత్​తో తమది అలాంటి మైత్రేనని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై భారత్, బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. భారత్‌ను సందర్శించడం తనకెప్పుడూ సంతోషంగానే ఉంటుందన్నారు. “భారత్‌ మా మిత్ర దేశం. ముఖ్యంగా మా బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో వారి సహకారం ఎన్నటికీ మరువలేనిది. మాకు స్నేహసంబంధాలు ఉన్నాయి. పరస్పరం సహకరించుకొంటాము” అని షేక్ హసీనా పేర్కొన్నారు.

“రాబోయే 25 ఏళ్లలో అమృత్ కాలపు కొత్త ఉషస్సులో ఆత్మనిర్భర్ భారత నిర్మాణం కోసం చేసిన తీర్మానాలను సాధించే దిశగా ముందుకు సాగుతున్న భారత్‌కు శుభాకాంక్షలు. ప్రధాని మోదీతో జరిగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. ఈ చర్చల ఫలితం.. ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనాలను తీసుకొస్తుంది. దృఢమైన స్నేహం.. సహకార స్ఫూర్తితో ఈ భేటీ జరిగింది.

భారత్‌-బంగ్లా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వాన్ని అభినందిస్తున్నాను. బంగ్లాదేశ్‌కు భారత్‌అత్యంత ముఖ్యమైన, సన్నిహిత పొరుగు దేశం. భారత్‌- బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక సంబంధాలు దౌత్య సంబంధాలకు రోల్ మోడల్‌గా ప్రసిద్ధి చెందాయి.” అని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి