
( 9 ఆగస్టు 1942 – క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం )
బ్రిటిష్ ప్రభుత్వంపై భారతీయుల ఆగ్రహాన్ని గ్రహించిన కాంగ్రెస్ సంస్థ, తెల్లదొరతనంపై పోరు పేరిట మొదలుపెట్టిన ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8న ఎఐసిసి సమావేశంలో ‘బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోవాలి’ అంటూ తీర్మానం చేసారు. హిందీలో ‘భారత్ ఛోడో ఆందోళన్’ పేరుతో మొదలైన ఉద్యమం ఘనత మహాత్మా గాంధీ, జవాహర్‌లాల్ నెహ్రూ, ఇతర కాంగ్రెస్ నాయకులకు లభించింది. కానీ ఆ ఉద్యమాన్ని నడిపించిన సామాన్యుల పేర్లు చరిత్రలోకి ఎక్కనే లేదు. గాంధీ ‘కరో యా మరో… చేయండి లేదా చావండి’ అనే నినాదం ఇచ్చిన కొద్ది గంటల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనాయకులు అందరినీ జైళ్ళలో పడేసింది. అప్పుడు అసంఖ్యాకంగా విప్లవకారులు, గ్రామీణ పోరాటయోధులు, మహిళలు, విద్యార్ధులు, స్థానిక నాయకులు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. కొందరు ప్రముఖ నాయకుల పేర్లు తప్ప భారత్ గురించి మిగతా ప్రపంచానికి తెలియని స్థితిలో దేశ స్వతంత్రాన్ని భారతీయులు ఎంతగా కోరుకుంటున్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటారు.
ఆగస్టు 8న సామూహిక అరెస్టుల తర్వాత ఒక విప్లవ నాయకురాలు అరుణా అసఫ్ అలీ బొంబాయి గోవాలియా ట్యాంక్ మైదానంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసింది. వెంటనే అండర్‌గ్రౌండ్‌కు వెళ్ళిపోయి రహస్య రేడియో నిర్వహించింది. మరోవైపు రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్టు భావజామున్న వ్యక్తి తిరుగుబాటు నాయకుడిగా ఎదిగారు. లోహియా బ్రిటిష్ వ్యతిరేక సాహిత్యాన్ని రహస్యంగా పంపిణీ చేసి, ప్రజల్లో ఉద్యమ జ్వాలలను సజీవంగా ఉంచాడు. అప్పటికే అరెస్ట్ అయిన జయప్రకాష్ నారాయణ నవంబర్‌లో జైలు నుంచి తప్పించుకుని బైటపడి లోహియాతో కలిసి పనిచేయసాగాడు.
ఉత్తరాది రాజకీయ కేంద్రాలకు దూరంగా బెంగాల్ మేదినీపూర్ జిల్లాలో 21ఏళ్ళ విధవ మాతంగినీ హజరా… తమ ప్రాంతంలోని రైతుల్లో స్వతంత్ర కాంక్షను రగిలించింది. సెప్టెంబర్ 29న మువ్వన్నెల జెండాతో వేలాదిమంది రైతులతో తామ్లుక్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించింది. పోలీసులు కాల్పులు మొదలుపెట్టినా వెనుకంజ వేయకుండా ముందుకే నడిచింది. తూటాలు తగిలినా జెండాను కింద పడనివ్వని మాతంగిని, దేశం కోసం ధైర్యంగా తుదిశ్వాస విడిచింది.
మహారాష్ట్ర సతారా జిల్లాలోనూ క్విట్ ఇండియా ఉద్యమం అతివాద ధోరణి తీసుకుంది. నానాపాటిల్, యశ్వంతరావు చవాన్‌ల నాయకత్వంలో స్థానిక ప్రజలు సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. దాదాపు మూడేళ్ళ పాటు ఆ ‘ప్రతి సర్కార్’ పనిచేసింది. పన్నులు వసూలు చేసింది, వివాదాలు పరిష్కరించింది, పాఠశాలలు నడిపింది, ప్రజలను రక్షించింది. ప్రతి సర్కార్ అన్నది కేవలం తెల్లదొరతనంపై ప్రతీకారం కాదు, స్వపరిపాలన కోసం ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం.
బిహార్‌లో ఉద్యమ జ్వాలలు చాలావేగంగా వ్యాపించాయి. రైల్వేస్టేషన్లు ధ్వంసమయ్యాయి, పాఠశాలలే ఆందోళన కేంద్రాలుగా మారాయి. విద్యార్ధులు, రైతులను కూడగట్టి కర్పూరీ ఠాకూర్ అనే యువకుడు ఉద్యమాన్ని కొనసాగించాడు. అనంతర కాలంలో అతను బిహార్ సిఎం అయ్యాడు కూడా.
ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో స్థానికులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టి కొన్నిరోజుల పాటు స్వతంత్రం ప్రకటించారు. స్వపరిపాలన ఎక్కువ రోజులు కొనసాగకపోయినా, ఆ ఉద్యమం బ్రిటిష్ పాలనలోని డొల్లతనాన్ని నిరూపించింది.
క్విట్ ఇండియా ఉద్యమానికి విద్యార్ధులే వెన్నుదన్నుగా నిలిచారు. విశ్వవిద్యాలయాలు మూతపడి నాయకులు జైళ్ళలో పడిన పరిస్థితుల్లో విద్యార్ధులు ఆ శూన్యాన్ని పూరించారు. ర్యాలీలు నిర్వహించారు, కరపత్రాలు ముద్రించి పంచారు, రైల్వేలైన్లకు ఆటంకాలు కలిగించారు. బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, అలహాబాద్ వంటి నగరాల్లో ధర్నాలు చేసారు, పోలీసు తూటాలకు ఎదురొడ్డారు. వారెవరూ ఎవరినుంచీ ఎలాంటి సూచనల కోసమూ ఆగలేదు. తమ నిబద్ధతతో విప్లవాన్ని నడిపించారు.
మహిళలు సైతం ఆ ఉద్యమాన్ని చూస్తూ ఊరుకోలేదు. వారు నాయకులుగా, సందేశ వాహకులుగా ఉద్యమాన్ని కొనసాగించారు. బొంబాయికి చెందిన విద్యార్థిని ఉషా మెహతా ప్రాణాలు పణంగా పెట్టి కాంగ్రెస్ రేడియో నడిపింది. బ్రిటిష్ పోలీసులు ఆమెను నిర్బంధించి చిత్రహింసలు పెట్టినా నోరువిప్పలేదు. ఒడిషాలో శశిభూషణ్ నాయక్ అనే గిరిజన మహిళ తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది. దేశవ్యాప్తంగా మహిళల పోరాటాలకు ఆమె ప్రతీక.
దక్షిణభారతం సైతం ఉద్యమంలో పాలుపంచుకుంది. తమిళనాడులో విద్యార్ధులు, కార్మికులు తెల్లదొరలు విధించిన కర్ఫ్యూలను ధిక్కరించారు. కామరాజ్ నాడార్ జైలుపాలైనా, మదురై, తిరుచినాపల్లి వంటి పట్టణాల్లో ఉద్యమం విస్తరించింది. క్విట్ ఇండియా ఉద్యమం కేవలం బ్రిటిష్ పాలిత భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. స్థానిక పాలకులకు సైతం సెగ పుట్టించింది. హైదరాబాద్‌లో ఉద్యమాన్ని ఆంధ్రమహాసభ ముందుండి నడిపించింది. కేరళలో తిరువాన్కూరు ఉద్యమాన్ని చవిచూసింది. అలా క్విట్ ఇండియా అనేది దేశవ్యాప్తంగా నైతిక విప్లవంగా విస్తరించింది.
బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. లక్షమందికి పైగా ఉద్యమకారులను అరెస్టు చేసారు. వేలాదిమందిని ఏ విచారణా లేకుండా అదుపులోకి తీసుకున్నారు. వార్తాపత్రికలను నిషేధించారు. ప్రభుత్వ దమనకాండ భారతీయుల్లో భయాన్ని పుట్టించలేదు, వారి స్వతంత్ర కాంక్షను మరింత తీవ్రతరం చేసింది. నాయకులను అరెస్టు చేసి ప్రజలను భయభ్రాంతులను చేయాలన్న బ్రిటిష్ పాలకుల వ్యూహం పనిచేయలేదు. కోట్లాది ప్రజల గుండెల్లో తిరుగుబాటు భావన ప్రజ్వరిల్లింది. దానికి తెల్లదొరతనం దగ్గర జవాబు లేదు.
అంతర్జాతీయంగానూ క్విట్ ఇండియా ఉద్యమం వలస పాలకుల ద్వంద్వస్వభావాన్ని బహిర్గతం చేసింది. ఐరోపాలో ఫాసిజంపై పోరాటం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న బ్రిటన్, తన వలసదేశాల్లో కోట్లాది ప్రజలకు కనీస స్వేచ్ఛా స్వతంత్రాలను హరించివేస్తున్న సంగతి బైటపడింది. యూనియన్ జాక్ కోసం పనిచేస్తున్న భారతీయ సైనికులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతుంటే, వారి స్వదేశం సంకెళ్ళలో బిగుసుకుపోయింది. తెల్లదొరల ఆ ద్వంద్వవైఖరి భారతీయులకే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసివచ్చింది. రాంమనోహర్ లోహియా వంటి నాయకులు బ్రిటిష్ పాలనను దుమ్మెత్తిపోయడానికి ఆ ఉద్యమాన్ని అవకాశంగా మలచుకున్నారు. చివరికి, బ్రిటిష్ ప్రభుత్వం తమ సొంత ప్రజలకు సైతం జవాబు చెప్పుకోలేని స్థితికి దిగజారిపోయింది.
కొన్నాళ్ళలోనే బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశ బలంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేసింది. కానీ ఆ సమయంలో సామాన్య భారతీయులు చేసిన తిరుగుబాటు… తెల్లదొరతనపు శక్తిని ఎవరూ ఎదిరించలేరన్న భ్రమలను పటాపంచలు చేసింది. పట్టణాల నుంచి పల్లెటూళ్ళ వరకూ ప్రతీచోటా సామాన్య భారతీయులు స్పందించిన తీరు వలస పాలకులకు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. బ్రిటిష్ పాలనను ప్రజలు వినయ విధేయతలతో అంగీకరించే కాలం పోయింది, భారతీయుల్లో తెల్లదొరతనం పట్ల వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. క్విట్ ఇండియా ఉద్యమం సాధించిన ఘనవిజయం అదే.
అదే సమయంలో ప్రపంచానికి మరో విషయం కూడా తేటతెల్లమైంది. భారతదేశపు పోరాటం ఏ కొద్దిమంది నాయకుల మీదనో ఆధారపడి లేదు. కష్టనష్టాలను సామూహికంగా పంచుకున్న సామాన్యజనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం కలిసికట్టుగా ముందుకు రాగలిగారు. పాలకులకు పిటిషన్లు దాఖలు చేసుకుని, వారు తిరస్కరిస్తే నోరు మూసుకునే నాయకత్వాలకు ఇక కాలం చెల్లింది. ఆ విషయాన్ని చరిత్ర నమోదు చేసింది. దాన్ని సరిగ్గా అర్ధం చేసుకునే శక్తి ఇవాళ మనకు కావాలి. కొన్ని పేర్లకు మాత్రమే పరిమితమైన మన చారిత్రక దృష్టిని విశాలం చేసుకోవాలి.
క్విట్ ఇండియా ఉద్యమం అంటే కేవలం గాంధీ చేపట్టిన నైతిక ఉద్యమమో, నెహ్రూ చేసిన రాజకీయ ప్రయోగమో కాదు… సామాన్య భారతీయుడు స్వీయ అస్తిత్వం కోసం గొంతెత్తి అరచిన నినాదం. రేడియో సంకేతాల ద్వారానూ, అజ్ఞాత కరపత్రాల ద్వారానూ, గ్రామాల్లో ఏరులై పారిన రక్తప్రవాహాల ద్వారానూ బైటపడిన స్వేచ్చాగానం. ఏ కొద్దిమంది నాయకుల పేర్లనో వల్లించడం కాదు… గుర్తింపు లేని తిరుగుబాటుదారులు, ధిక్కార స్వరం పలికించిన విధవరాళ్ళు, ముక్కుపచ్చలారకుండానే దేశమాత కోసం పోరుబాట పట్టిన చిన్నారులు, ముసుగుల వెనుక దాగిన గెరిల్లాలూ… వారందరినీ స్మరించుకోవలసిన సందర్భమిది.





