News

నైతిక విలువలతోనే ఉజ్వల భవిష్యత్తు : చాగంటి కోటేశ్వరరావు

33views

అమరావతి: యువత ప్రతి చిన్న విషయానికీ క్షణికావేశాలు, ఆకర్షణలకు లోనుకాకుండా సంయమనంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ విద్య, నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అసాంఘీక కార్యకలాపాల్లో పాల్గొని పోలీసు రికార్డుల్లో పేరు నమోదైతే అది జీవితాంతం చెరగని “బ్లాక్ డాట్”గా మిగిలిపోతుందని హెచ్చరించారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత విస్తృతంగా ఉన్నందున తప్పు చేసిన వారిని సులభంగా గుర్తించే పరిస్థితి ఉందని, కుటుంబాలు యువతపై పెట్టుకున్న ఆశలు, కలలను చెదరగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన “విద్యార్థి సౌశీల్య వికాసం – నైతిక విలువలు” సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

మాతృభాషకు గౌరవం.. మహనీయుల జీవితాలు ఆదర్శం
మాతృభాషను ఎన్నడూ తక్కువగా చూడకూడదని చాగంటి అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో పద్యాలు, సాహిత్యంపై ఆసక్తి పెంపొందేలా ప్రోత్సహించాలని సూచించారు. తరగతి గది అనేది విద్యార్థిని సంస్కారవంతుడిగా తీర్చిదిద్దే పవిత్ర స్థలమని పేర్కొన్నారు. ఆధునిక కృత్రిమ మేధ (AI) చేయలేని ఎన్నో అద్భుతాలను ఉపాధ్యాయులు సాధించగలరని కొనియాడారు.

పుట్టుకతో లేని గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని విద్య అందిస్తుందని పేర్కొంటూ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హోమీ జె. భాభా, విక్రమ్ సారాభాయ్, మేడమ్ క్యూరీ వంటి మహనీయ శాస్త్రవేత్తల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధులతో పాటు దేశాభివృద్ధికి కృషి చేసిన మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని సూచించారు.

కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి
సమాజాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలకంటే, మంచి మార్గంలో నడిపించే మాటలే అవసరమని చాగంటి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ కష్టపడటాన్ని అలవాటు చేసుకోవాలని, చెమట చిందించడమే మనిషికి నిజమైన పరిమళమని అన్నారు.

సెల్‌ఫోన్లు, యూట్యూబ్ వంటి వేదికల్లో పనికిరాని విషయాలపై సమయాన్ని వృథా చేయకుండా, మంచి పుస్తకాలను చదివే అలవాటు పెంచుకోవాలని సూచించారు. కష్టాలు ఎదురైనప్పుడు నిరాశకు లోనై ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోవడం పిరికితనమని పేర్కొన్నారు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని నిలబడినవారే జీవితంలో విజయాన్ని సాధిస్తారని చెప్పారు.

చరిత్రలో మహనీయులుగా నిలిచిన వారందరూ ఎన్నో కష్టాలను అధిగమించి విజయ శిఖరాలను అధిరోహించిన వారేనని చాగంటి కోటేశ్వరరావు యువతకు స్పూర్తిదాయక సందేశం ఇచ్చారు.