ArticlesNews

మూలనివాసీ దినం భారతీయులకు అవసరమా?

8views

ఐక్యరాజ్య సమితి 1982లో ప్రపంచ దేశాలలోని మూలనివాసీ ప్రజల గురించి అధ్యయనానికి ఒక వర్కింగ్ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. ఆ గ్రూప్ మొదటి సమావేశం 1982 ఆగస్టు 9న జరిగింది. దానికి గుర్తుగా ఐరాస సర్వప్రతినిధిసభ 1994 నుంచీ ప్రతీయేటా ఆగస్టు 9న అంతర్జాతీయ మూలనివాసుల దినం జరుపుతోంది. నిజానికి ఆ దినాన్ని జరుపుకోవడం మనదేశానికి అవసరమా?

అంతర్జాతీయ మూలనివాసీ దినాన స్కాండినేవియన్ దేశాలు తమ వైకింగ్, పాగన్ సంస్కృతిని తలచుకుంటాయి. యుకె, దాని పొరుగు దేశాలూ జిప్సీ, రోమానీ తెగలకు నివాళులర్పిస్తారు. అమెరికా, దాని పొరుగు దేశాలూ నేటివ్ అమెరికన్ తెగలకు నివాళులర్పిస్తారు. ఆస్ట్రేలియన్లు తమ మూలనివాసులను గుర్తుచేసుకుంటారు. న్యూజీలాండ్‌ మావోరీ తెగవారిని గౌరవిస్తుంది. భారత్ కూడా తమ గిరిజన తెగల సంస్కృతీ వైవిధ్యాలను కొనియాడుతూ వేడుకలు జరుపుతుంది. నిజానికి అది మనకు అక్కరలేదు.

పాశ్చాత్యదేశాలు మూలనివాసీ దినాన్ని జరుపుకున్నాయంటే అర్ధముంది. వాటన్నింటికీ ఉమ్మడిగా వలసవాదమనే లక్షణముంది. ఆ దేశాలన్నీ ఏదో ఒక దశలో వలసలే. ఇంగ్లీషు మాట్లాడే యుకె, యుఎస్, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలన్నీ బ్రిటిష్ వలస సామ్రాజ్యానికి కొనసాగింపులే. వాటిపై బ్రిటిష్‌వారు దాడులు చేసి ఆక్రమించారు. ఆయా దేశాలలోని నేటివ్ అమెరికన్స్, అబోరిజినల్స్, మావోరీస్ తెగలను లక్షలమందిని ఊచకోత కోసి చంపేసారు. స్త్రీపురుషులు, బాలురూ వృద్ధులూ అన్న తేడాలేమీ లేకుండా అందరినీ బానిసలుగా మార్చేసారు. వారి వనరులను దోచుకున్నారు. వారి సంస్కృతులను తుడిచిపెట్టేసారు. ఇప్పుడా తెగలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.

ఇప్పుడా దేశాల్లో స్థిరపడిన తెల్లవారికి తమ పూర్వీకులు స్థానిక మూలనివాసులపై చేసిన అకృత్యాలూ పాపాల విషయంలో సామూహిక దోషభావన ఉంది. దాన్ని తొలగించుకోడానికే, తమ పూర్వీకులు ఊచకోత కోసిన మూలనివాసీలను యేడాదికి ఒకసారి గౌరవించుకోవడం మొదలుపెట్టారు. అదే ఈ అంతర్జాతీయ మూలనివాసీ దినం. ఇంకోలా చెప్పుకోవాలంటే… నిత్యం మారిపోతున్న ప్రపంచంలో, నిత్యం మారిపోతున్న అభిప్రాయాల వల్ల… అధికారంలో ఉన్నవారికి మూలనివాసీలను ఇంకా దోచుకోవడం కష్టసాధ్యమవుతోంది. ప్రపంచం తమను మంచివారిగానూ గుణవంతులుగానూ చూడడం వారికి అవసరం. అందుకే, మూలనివాసీలపై తమ సానుభూతిని చాటుకోడానికి ఈ దినం జరుపుతారు. నిజానికి మూలనివాసీల దోపిడీ ఇప్పుడూ మరింత సూక్ష్మరూపంలో జరుగుతూనే ఉంది. మూలనివాసీలకు తమదైన సంస్కృతి లేకుండా పోయింది. వారి ఆత్మగౌరవాన్ని తుడిచిపెట్టేసారు. ఇప్పుడు వాళ్ళు నగరాల్లోని మురికివాడల్లో దయనీయంగా జీవిస్తున్నారు. భౌతికంగా జనహననాలు తగ్గాయి కానీ సాంస్కృతిక వినాశనం కొనసాగుతూనే ఉంది.

మనదేశం విషయానికి వస్తే… భారతీయులందరూ ఈ దేశ మూలనివాసులే. బ్రిటిష్‌వారు మన జాతిని సమూలంగా తుడిచిపెట్టేయడంలో విఫలమయ్యారు. అలాంటప్పుడు మనం ఈ దినాన మన గిరిజనులకు వేడుక చేయడం దేనికి? అదే చేయాలనుకుంటే ఇంకోరోజున జాతీయ గిరిజనుల దినోత్సవం జరుపుకోవచ్చు. పాశ్చాత్యులు తమ దోషభావనకు పరిహారంగా జరుపుకునే ఈ మూలనివాసీల దినం మనకు అనవసరం. మన పూర్వీకులు ఏనాడూ ఏ దేశంపైనా దండయాత్రలు చేయలేదు, లక్షలాదిమంది జనాలను ఊచకోత కోయలేదు. నిజానికి ముస్లిం ఆక్రమణదారులు, బ్రిటిష్ దోపిడీదారుల చేతిలో ప్రాణాలు కోల్పోయినదీ, దోచుకోబడినదీ మనమే.

ఆ నిజాన్ని దాచిపెట్టడం కోసమే పాశ్చాత్యదేశాలు, వాటి తొత్తులూ ఆర్య ద్రవిడ వాదాన్ని తెరమీదకు తెచ్చారు. భారతదేశం ఒకజాతి కాదు… ఆర్యులు, ద్రవిడుల సమ్మేళనం, ఆర్యులు ఆక్రమణదారులు అంటూ మనదేశాన్ని ముక్కలు చేసే సిద్ధాంతాన్ని ప్రచారం చేసారు. ఆ సిద్ధాంతపు అడుగు శాస్త్రీయంగా ఏనాడో ఊడిపోయింది. ఇప్పటి భారతీయుల పూర్వీకులందరూ వేలాది యేళ్ళుగా ఇక్కడే నివసిస్తున్నవారే అని ఎన్నోరకాలుగా నిరూపితమైంది. పాశ్చాత్యులు ఎన్నిసార్లు మనలోమనకు విభేదాలు పెట్టాలని ప్రయత్నించినా ఫలించలేదు. భారతీయులందరూ ఈ దేశపు మూలనివాసులే. అందువల్ల… పాశ్చాత్యులు తమ దోషభావనను తొలగించుకోడానికి జరుపుకునే ఈ మూలనివాసుల దినం భారతీయులకు ఎంతమాత్రం అవసరం లేదు.