News

భారత్‌లోకి చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదుల యత్నం

100views

న్యూఢిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వీరంతా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు లాంచ్‌ ప్యాడ్‌ల వద్ద మోహరించినట్టు పేర్కొంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా తిప్పికొట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కశ్మీర్‌ ఉత్తరభాగంలోని కేరన్‌ పోస్టు వద్ద నిఘాను తీవ్రం చేసింది. శత్రువులతో పోరాడుతున్న సైనికులకు ఇప్పుడిప్పుడే శీతకాల ప్రభావం కూడా ఎదురవుతోంది.

చలిగాలులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గినా, మాదక ద్రవ్యాలు మాత్రం భారీగానే దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నట్టు సైనిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

డ్రగ్స్‌ ద్వారా సంపాదించిన డబ్బులతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీన్ని నియంత్రించేందుకు గట్టి కృషి చేస్తున్నామని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ చెప్పారు. ఉగ్రవాదులే కాకుండా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు భారత్‌లోకి చొరబడకుండా సరిహద్దుల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి