News

భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్ ‌కు అత్యవసర వినియోగ అనుమతి

198views

కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. కొవిడ్ ‌పై భారత్‌ సాగిస్తున్న పోరును ఈ టీకా మరింత బలోపేతం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం, అందరి సహకారంతో భారత్ లో‌ కొవిడ్ ‌ను సమర్థంగా ఓడిస్తామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. దేశంలో అనుమతి పొందిన తొలి నాసల్‌ వ్యాక్సిన్‌ ఇదే కావడం గమనార్హం.

నాసల్‌ వ్యాక్సిన్ ‌కు సంబంధించి సుమారు 4వేల మంది వాలంటీర్లపై భారత్‌ బయోటెక్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందులో ఎవరిలోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ గానీ, దుష్ప్రభావాలు కనిపించలేదని కంపెనీ తెలిపింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని గత నెల వెలువరించిన మూడో దశ ప్రయోగ ఫలితాల సందర్భంగా కంపెనీ పేర్కొంది. కొన్ని మార్పులు చేసిన చింపాంజీ అడినోవైరస్‌ వెక్టార్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘వాషింగ్టన్‌ యూనివర్శిటీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.