ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్ కు మాత్రమే ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో ముందున్న చైనాకు భారత్ అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు. అపార మానవ వనరులే భారత్ బలమని వివరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చైనాతో పాశ్చాత్య దేశాల పొరపొచ్చాలు పెరిగిన తర్వాత.. భారత్ వైపు సానుకూల పవనాలు వీస్తున్నాయి. డ్రాగన్ దేశం నుంచి పరిశ్రమల్ని తరలిస్తే.. ప్రత్యామ్నాయంగా భారత్ నే ఎంచుకునే అవకాశం ఉందని చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ అంచనాలన్నింటికీ బలం చేకూర్చే కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది.
అమెరికాకు క్రిస్మస్ అలంకరణ వస్తువులు, టీ-షర్టులు ఎగుమతి చేస్తున్న తొలి ఐదు దేశాల జాబితాలోకి భారత్ చేరింది. యూఎస్ కస్టమ్స్ సమాచారం ప్రకారం.. గత నెల సముద్ర మార్గాన అగ్రరాజ్యానికి ఎగుమతి అయిన పండగల వస్తువులు, ఉపకరణాల విలువ 20 మిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఏడాదితో పోలిస్తే.. ఇది దాదాపు మూడింతలు అధికం. ఈ విషయంలో భారత్… ఫిలిప్పైన్స్ ను అధిగమించింది. చైనాలో ‘జీరో-కొవిడ్’ విధానం వల్ల కార్మికుల వేతనాలు పెరిగాయి. మరోవైపు సరఫరా వ్యవస్థల్లోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అమెరికాలో విక్రేతలు తమ కొనుగోలు వనరుల్ని క్రమంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత్ కు లబ్ధి చేకూరుతున్నట్లు స్పష్టమవుతోంది.
గ్లోబల్ బ్రాండ్స్ అయిన వాల్ట్ డిస్నీ, లండన్స్ హరాడ్స్, టార్గెట్ కార్పొరేషన్, దిల్లాడ్స్ వంటి కంపెనీల నుంచి ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లు దేశీయ విక్రేతలు తెలిపారు. అమెరికాలో క్రిస్మస్ అలంకరణ వస్తువుల వ్యాపారంలో చైనా వాటాయే ఎక్కువ. అయినప్పటికీ.. కొత్త కొనుగోలుదారులు భారత్ వైపు మొగ్గుచూపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఒక్క కిస్మస్ కు సంబంధించిన వస్తువులేగాక దుస్తులు, హస్తకళలకు సంబంధించిన వస్తువులు, ఎలక్ట్రానిక్సేతర వినియోగ పరికరాలకూ భారీ ఎత్తున ఆర్డర్లు వస్తున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా నుంచే కాకుండా ఐరోపా నుంచి కూడా ఆర్డర్లు అందుతున్నట్లు వెల్లడించాయి.
2018లో అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే యూఎస్ విక్రేతలు తమ కొనుగోలు వనరుల్ని విస్తృతం చేసుకోవడం ఆరంభించారు. అయితే, అప్పుడు భారత్ కు పెద్దగా లబ్ధి చేకూరలేదు. బీజింగ్ నుంచి తరలిపోయిన ఆర్డర్లన్నీ అప్పట్లో వియత్నాంకు చేరాయి. కానీ, కరోనా మహమ్మారి అంతానికి చైనా ఎంచుకున్న లాక్‌డౌన్‌ల విధానం.. పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. తైవాన్, ఐరోపా సమాఖ్య, అమెరికా, జపాన్.. భారత్ వైపు చూడడం ప్రారంభమైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతుల విలువ 420 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే దానిలో సగానికి అధిగమించడం విశేషం. అదే సమయంలో చైనా ఎగుమతుల విలువ గత ఏడాది 3.36 ట్రిలియన్ డాలర్లుగా నమోదవడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో క్రిస్మస్ అలంకరణ వస్తువుల ఎగుమతుల విలువ 2020 నాటితో పోలిస్తే 54 శాతం పెరిగింది. హస్తకళలకు సంబంధించిన వస్తువుల ఎగుమతులు 32 శాతం ఎగబాకాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి చైనా క్రమంగా దూరమవుతుండడంతో పాటు కరోనా నుంచి భారత్ వేగంగా కోలుకుంటుండడమే ఇప్పుడు కలిసొస్తోంది. 2030 నాటికి భారత్ లో అపార మానవ వనరులు అందుబాటులో ఉంటాయని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదికొకటి ఇటీవల వెల్లడించింది. అప్పటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 500 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.