News

బంగ్లాకు సమస్యాత్మకంగా మారిన రోహింగ్యాలు… భార‌త్‌పైనే ఆశ‌ల‌న్నీ..: బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా

420views

ఢాకా: లక్షల మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌కు సమస్యాత్మకంగా మారారని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమస్యను భారత్‌ పరిష్కరించగలద‌న్న ఆశాభావాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. శరణార్థులు లక్షల్లో ఉండటంతో దేశంలో అంతర్గతంగా సవాళ్ళు తలెత్తుతున్నాయని, కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో భారత్‌ చాలా సాయం చేసిందని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

“అది భారమని మాకు తెలుసు. భారత్‌ పెద్ద దేశం. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు. మా దేశంలో 1.1మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్ళ‌కు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో చర్చలు జరుపుతున్నాం. మానవీయ కోణంలోనే మేము వారికి ఆశ్రయం ఇచ్చాం. కొవిడ్‌ సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించాం. కానీ, వారు ఏన్నాళ్ళుంటారు… అందుకే వారిని క్యాంపులో ఉంచాం. అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు మాదకద్రవ్యాల, మహిళల అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారు. వారు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే మాకు, మయన్మార్‌కు అంత మంచిది. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపే విషయమై ఏషియాన్‌, యూఎన్‌వో, ఇతర దేశాలతో చర్చిస్తున్నాం. కానీ, భారత్‌ పొరుగు దేశం. వారు దీనిలో కీలక పాత్ర పోషించగలరు. నేను అదే అనుకొంటున్నాను” అని షేక్‌ హసీనా పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి