News

రఫేల్ ‌పై మరోసారి దర్యాప్తునకు నో అన్న సుప్రీం

347views

ఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది.

36 యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ డీల్‌ భారత్ ‌- ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన విషయం తెలిసిందే.ఎం.ఎల్‌. శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ‌ను పరిశీలించిన అనంతరం, చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్ ‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. మరోసారి లెటర్స్‌ రోగటరీని జారీ చేసి ఈ డీల్ ‌కు సంబంధించిన ఆధారాలు సేకరించాలని ఈ పిటిషన్‌లో కోరారు. దీంతోపాటు ఈ డీల్‌ కుదిరేందుకు మధ్యవర్తులకు దసో సంస్థ బిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు. కానీ, సుప్రీం కోర్టు బెంచ్‌ ఈ అంశాన్ని పరిశీలించడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ శర్మ తన పిల్ ‌ను ఉపసంహరించుకున్నారు.

భారత్ ‌- ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన ఈ డీల్ ‌పై దాఖలైన కొన్ని పిల్స్ ‌ను సుప్రీంకోర్టు 2018లో తిరస్కరించింది. ఈ డీల్‌ కుదిరిన సందర్భాన్ని అనుమానించేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు.

రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంటోంది. గతంలో విమానాల తయారీదారు దసో ఏవియేషన్ భారత్ ‌కు చెందిన ఒక మధ్యవర్తికి 10,17,850 యూరోల (రూ.8.8 కోట్లు)ను చెల్లించినట్లు ఫ్రెంచ్‌ పోర్టల్ ‘మీడియా పార్ట్‌’లో కథనం ప్రచురితమైంది. ఫ్రాన్స్‌ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు పేర్కొంది. దసో సంస్థలో అవినీతి నిరోధక విభాగం ఆడిట్ చేసినప్పుడు ఈ విషయం వెల్లడైందని తెలిపింది. కానీ దసో ఏవియేషన్ దానిని ఖండించింది. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన దసో సంస్థ నుంచి 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుకు 2016లో భారత్ ఒక ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విమానాలు భారత వాయుసేన అమ్ములపొదిలో ఉన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.