
కాంగ్రెస్ తో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ ఇటీవల హస్తం పార్టీని వీడిన దిగ్గజ నేత గులాం నబీ ఆజాద్ ఎట్టకేలకు తన రాజీనామాపై మౌనం వీడారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బలవంతంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆజాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడుతోందన్నారు.
అప్పుడు 6 రోజులు నిద్రపోలేదు..
జీ23 నేతలతో కలిసి నేను పార్టీ అధిష్ఠానికి లేఖ రాసినప్పటి నుంచే నాకు, పార్టీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. వారు (కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఉద్దేశిస్తూ).. తమనెవరూ ప్రశ్నించకూడదని అనుకుంటారు. ఎన్నోసార్లు కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. అందులో మేం చెప్పే ఒక్క సలహాను కూడా వారు తీసుకోలేదు. కానీ, పార్టీ కోసం మేం రక్తం చిందించాం. అందుకే తట్టుకోలేక ఆ లేఖ రాశాం. ఆ లేఖ రాయడానికి ముందూ, తర్వాత ఆరు రోజుల పాటు నేను నిద్రలేని రాత్రులు గడిపా” అని ఆజాద్ చెప్పుకొచ్చారు. రాజీనామా చేయాలని తాను ఎన్నడూ అనుకోలేదని, కానీ, తన ఇంట్లో నుంచి తానే బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఆయన దుయ్యబట్టారు.
ఏ క్షణమైనా కాంగ్రెస్ కూలిపోవచ్చు..
”కాంగ్రెస్ నాయకత్వానికి లోపాలను సరిదిద్దుకునే సమయం లేదు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవారంతా ఎందుకూ పనికిరారు. రాష్ట్ర అధ్యక్షులు పార్టీ సభ్యులను ఏకం చేయాల్సింది పోయి.. వారు పార్టీని వీడేలా చేస్తున్నారు. ‘మూలుగుతున్న’ కాంగ్రెస్ డాక్టర్ నుంచి కాకుండా కంపౌండర్ నుంచి మందులు తీసుకుంటోంది. ఆ పార్టీ పునాదులు బలహీనపడుతున్నాయి. ఏ క్షణమైనా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది” అని ఆజాద్ అభిప్రాయపడ్డారు.
30ఏళ్ల క్రితం సోనియా గాంధీపై ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడూ ఆమెను అలాగే గౌరవిస్తున్నానని ఆజాద్ ఈ సందర్భంగా తెలిపారు. ఇందిరాగాంధీ కుటుంబ వారసుడిగా.. రాజీవ్-సోనియా కుమారుడిగా రాహుల్ నూ అంతే గౌరవిస్తున్నానని అన్నారు. రాహుల్ గాంధీని విజయవంతమైన నేతగా చేయాలని అనుకున్నామని, కానీ ఆయన అంత ఆసక్తి చూపించలేదని చెప్పుకొచ్చారు.
అది కేవలం కాంగ్రెస్ ప్రచారం మాత్రమే..
ఈ సందర్భంగా ప్రధాని మోడీపై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు. మోడీ చాలా కఠినమైన మనిషి అని మొదట తాను అభిప్రాయపడ్డానని అన్నారు. కానీ, ప్రధాని చాలా గొప్ప మానవతావాది అని కొనియాడారు. “అయితే భాజపాలో చేరుతున్నారా?” అని ప్రశ్నించగా.. ”నేను భాజపాలో చేరడం లేదు. ఆ నిర్ణయం జమ్మూకశ్మీర్‌లో నా రాజకీయాలకు ఏ మాత్రం ఉపయోగపడదు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రచారం మాత్రమే” అని కొట్టిపారేశారు.





