News

గణేశ్‌ మండపాలకు ఎలాంటి రుసుమూ లేదు: దేవాదాయశాఖ

455views

* మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీస్‌, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి అని స్పష్టీకరణ

వినాయక చవితి ఉత్సవాలపైనా రాష్ట్ర ప్రభుత్వం రుసుముల భారం మోపిందని పెద్ద ఎత్తున విమర్శలు రావడంపై దేవాదాయశాఖ స్పందించింది.

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్‌ మండపాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదని దేవాదాయశాఖ కమిషనర్‌ జవహర్ ‌లాల్‌ తెలిపారు. రుసుం వసూలు చేస్తున్నారని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. కానీ మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీస్‌, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొందాలని స్పష్టం చేశారు. ఎవరైనా రుసుములు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

వినాయక చవితి పండుగపై ఆంక్షలేంటి?: సోము వీర్రాజు

వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. ప్రభుత్వ అడ్డగోలు నిబంధనలపై రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హిందువులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వినాయకచవితి పండుగపై ఆంక్షలేంటని ప్రశ్నించారు. ఎన్నడూలేని విధంగా వివిధ రకాల అనుమతులు పొందాలంటూ డీజీపీ ద్వారా కుట్రపూరిత ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. మండపాల నిర్వాహకులు, ఉత్సవ సమితి సభ్యులను వేధిస్తూ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక మండపం కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీ అనుమతులు ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.