
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీం కోర్టు లైవ్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ హిమా కోహ్లీతో బెంచ్‌ను పంచుకున్నారు. ఈ త్రిసభ్య ధర్మాసనం విచారణలు జరుపుతోంది. తొలిసారిగా సుప్రీం కోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో సుప్రీంకోర్టును ప్రజలకు చేరువచేసే క్రమంలో మరో ముందడుగు పడింది.
సీజేఐగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రయత్నాలు చేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ.. తాను పదవీ విరమణ చేసే రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్‌పై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని ఆయన పలుమార్లు అభిప్రాయపడ్డారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆకాంక్షించారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ విశేష సేవలు అందించారు. న్యాయవాది నుంచి సీజేఐ స్థాయికి ఎదిగారు. 13 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. సీజేఐగా 2021 ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘకాలం సీజేఐగా చేసిన తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు.





