News

ఠాక్రే వర్సెస్ శిందే… విస్తృత ధర్మాసనానికి ఆ కేసులు బదిలీ

379views

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన సమయంలో శివసేన ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్లపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు అవసరమని గతంలో సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలోనే రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఈ షెడ్యూల్​కు సంబంధించి నబాం రెబియా కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగ నైతికతకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది.

రాజ్యాంగంలోని 10 షెడ్యూల్​కు సంబంధించిన కీలక అంశాలను పిటిషన్లు లేవనెత్తుతున్నాయని సీజేఐ తెలిపారు. అందువల్ల, ఎమ్మెల్యేల అనర్హత, గవర్నర్, స్పీకర్ల అధికారాలు, న్యాయ సమీక్షపై పరిశీలన జరపాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో శివసేన తమదేనని, పార్టీ గుర్తు తమకే కేటాయించాలని శిందేవర్గం పెట్టుకున్న అభ్యర్థనపై ఎన్నికల సంఘం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేశారు.

స్పీకర్​ను తొలగించేందుకు నోటీసులు జారీ చేసిన తర్వాత.. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై స్పీకర్ తదుపరి చర్యలు కొనసాగించవచ్చా? అనే విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాలపై పరిశీలన చేయనుంది. ఆగస్టు 25న విస్తృత ధర్మాసనం వాదనలు విననుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి