తిరువనంతపురం: కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపీనాథ్ రవీంద్రన్ ఓ క్రిమినల్ అని, తనపైనే దాడి చేసేందుకు కుట్ర పన్నారని, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న సమయంలో యూనివర్శిటీకి వచ్చిన తనపై డిసెంబర్, 2019లో దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో వీసీ గోపీనాథ్ రవీంద్రన్ కూడా ఉన్నారని ఆయన పేర్కొ న్నారు.
కన్నూర్ నూతన వీసీ నియామకం విషయంలో గవర్నర్‌కు అధికార సీపీఎంకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వీసీ తీరుపై గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఈ విధంగా మాట్లాడారు. “ వీసీనే నన్ను యూనివర్శిటీకి ఆహ్వానించారు. నాపై భౌతిక దాడి జరిగే సమయంలో ఆయన బాధ్యత ఏమిటి? పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా? కానీ ఆయన అలా చేయలేదు. కేవలం రాజకీయ కారణాల వల్లనే ఆయన వీసీ స్థానంలో కూర్చున్నారు” అని గవర్నర్ మొహమ్మద్ ఖాన్ తెలిపారు.
Source: Nijamtoday