
ముంబై: మావోయిస్టులతో సంబంధముందన్న ఎల్గార్ పరిషద్ కేసులో బెయిల్‌పై ఇటీవల విడుదలైన ప్రముఖ కవి, విప్లవ కార్యకర్త వరవరరావుపై ఆంక్షలు కొనసాగుతాయని కోర్టు స్ఫష్టం చేసింది. ముంబయిలోనే ఉండాలని, అనుమతి లేకుండా నగరం పరిధి దాటి వెళ్ళరాదని స్థానిక ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆరోగ్య కారణాలపై సుప్రీంకోర్టు ఈ నెల 10న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా ప్రత్యేక న్యాయస్థానం వరవరరావుకు జారీ అయిన బెయిల్‌పై ఆంక్షలను విధించగా, ఆ వివరాలు శనివారం వెలుగులోకి వచ్చాయి.
ముంబయిలోనే నివాసం ఉండాలని, ఎన్‌ఐఎ నుంచి ముందస్తు అనుమతి లేకుండా నగరం పరిధి దాటి బయటకు వెళ్ళరాదని ప్రత్యేక న్యాయస్థానం ఆంక్షలు విధించింది. ఒక వేళ ముంబయి నివాసంలోనే ఉంటున్నా, ఆ సమయంలో ‘ఇతరులను ఎవ్వరినీ’ కలవరాదని నిర్దేశించింది.
‘నేర కార్యకలాపాల్లో కానీ, ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న కేసుకు తరహా కార్యకలాపాల్లోకానీ పాలుపంచుకోరాదని, అలాగే సహ నిందితులు లేదా అలాంటి తరహా వ్యక్తులెవ్వరినీ కలుసుకోరాదని, భేటీ కారాదని కూడా ప్రత్యేక న్యాయస్థానం నిబంధనలు విధించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రింట్, ఎలక్ట్రాన్, సోషల్ మీడియాకు తెలియజేయరాదని కూడా నిర్దేశించింది. ఆంక్షలతో పాటు బెయిల్‌కు మరికొన్ని షరతులను కూడా ప్రత్యేక న్యాయస్థానం అదనంగా చేర్చింది.
పూచీకత్తుగా తాజాగా ఇద్దరు వ్యక్తుల నుంచి సంతకాలతో పాటు రూ.50 వేల బాండును సమర్పించాలని ఆదేశింది. 2017 డిసెంబర్ 31న మహారాష్ట్రలోని కోరేగావ్ భీమా యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన ఎల్గార్ పరిషద్ సదస్సులో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై 2018 ఆగస్టు 28న వరవరరావుతో పాటు పలువురు సామాజిక, హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Source: Nijamtoday